
డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఇక జైలే!
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన వాహనదారులను జైలుకు పంపిస్తామన్నారు.
గన్‌ఫౌండ్రీ: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహన దారులు రోడ్డు పైకి రావద్దని నగర ట్రాఫిక్ డీసీపీ ఎ. రంగనాథ్ సూచించారు. ఆగస్టు 4వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. శనివారం గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రెయిై నింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వాహనాలకు సైడ్ ఇండికేటర్స్, హెడ్‌లైట్స్ లేకుండా నడుపుతూ పట్టుబడిన 350 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ మాట్లాడుతూ.... అనేక మంది వాహనదారులకు సైడ్ లైట్స్ పై కనీస అవగాహన లేదన్నారు.
ఆగస్టు 4వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన వాహనదారులను కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపిస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇక నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ తనిఖీలను ముమ్మరం చేస్తామని వెల్లడించారు. వాహనదారులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు నంబర్‌ను వెంట ఉంచుకోవాలని కోరారు. ఆధార్‌కార్డు నెంబర్ లేకపోతే చలాన్ సైతం నమోదు కాదన్నారు. ఆధార్ నంబర్ తప్పుగా ఇస్తే చీటింగ్ కేసు నమోదు చేస్తామన్నారు. ఇకపై హెడ్‌లైట్స్ లేని వాహనాలను అదుపులోకి తీసుకుని వాహనానికి హెడ్‌లైట్స్‌ను అమర్చిన అనంతరం మాత్రమే అప్పగిస్తామన్నారు. దీంతో పాటు జరిమానా కూడా విధిస్తామన్నారు.