లాంఛనప్రాయ స్వాధీనానికే నోటీసులిచ్చాం
⇒ హైకోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నివేదన
⇒ దీంతో తదుపరి విచారణ అవసరం లేదన్న న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: ఆస్తుల స్వాధీనానికి చట్టంలో నిర్ధేశించిన విధానం ప్రకారం నోటీసులు జారీ చేశామే తప్ప, ఆస్తులను వాస్తవ రూపంలో స్వాధీనం చేసుకోవడానికి కాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. ఈ నోటీసుల జారీ ద్వారా తాము కేవలం ఆస్తులను లాంఛనప్రాయ స్వాధీనం (సింబాలిక్ పొసెషన్)లోకి మాత్రమే తీసుకున్నామని వివరించారు. దీంతో ఈడీ జారీ చేసిన నోటీసుల విషయాన్ని ఈడీ అప్పిలేట్ అథారిటీ ముందుంచాలని పిటిషనర్లకు సూచిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తమ స్థిరాస్తుల స్వాధీనం నిమిత్తం మనీలాండరింగ్ చట్ట నిబంధనల కింద ఈడీ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ వై.ఎస్.భారతితో పాటు మరికొన్ని కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామలింగేశ్వరరావు బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది పి.ఎస్.పి.సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... హైకోర్టు ధర్మాసనం, అప్పిలేట్ అథారిటీ ఉత్తర్వులను ఎక్కడా ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. ఏ స్థిరాస్తినీ బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని ధర్మాసనం చెప్పిన తీర్పు ప్రకారమే తాము నోటీసులు జారీ చేశామని తెలిపారు.
కేవలం లాంఛనప్రాయ స్వాధీనం నిమిత్తమే నోటీసులు ఇవ్వడం జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నోటీసులు లాంఛనప్రాయ స్వాధీనానికేనని ఈడీ చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై తదుపరి విచారణ అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈడీ నోటీసుల జారీ అంశాన్ని అప్పిలేట్ అథారిటీ ముందుంచాలని పిటిషనర్లకు స్పష్టం చేశారు. నోటీసుల జారీ సక్రమమో, కాదో అప్పిలేట్ అథారిటీనే తేలుస్తుందంటూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.