సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులతో పాటు సిటీ పోలీసుల్నీ ముప్పతిప్పలు పెడుతున్న సూడో పోలీసుల కోసం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) వేట ముమ్మరం చేసింది. పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఏడు బృందాలు దేశ వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో దాడులు చేసి.. తొమ్మిది మంది సూడో పోలీసులను పట్టుకున్నాయని డీసీపీ లేళ్ల కాళిదాస్ వేంకట రంగారావు ఆదివారం వెల్లండించారు. అదనపు డీసీపీ ఎంవీ రావుతో కలిసి ఆయన విలేకరులకు పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ ముఠాలు 2008 నుంచి దేశ వ్యాప్తంగా 50కి పైగా నేరాలు చేసినట్లు ఆయన తెలిపారు.
చిరువ్యాపారుల ముసుగులో బస...
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు చెందిన ఇరానీ తదితర గ్యాంగులు ‘సూ డో నేరాలు’ చేస్తున్నాయి. దేహ దారుఢ్యమే పె ట్టుబడిగా రెచ్చిపోయే ఈ ముఠాలు ఒంటరిగా వెళ్తున్న మహిళలు, బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తున్న వారినే ఎక్కువగా టా ర్గెట్ చేసి.. బంగారు నగలు, నగదును ఎత్తుకుపోతుంటాయి. వరుస నేరాలు చేయడం కోసం ఒక నగరాన్ని ఎంచుకొని.. ఎనిమిది నుంచి పది మంది ఓ ముఠాగా ఏర్పడి అక్కడ కు చేరుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉం డేందుకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న తక్కువ ఖరీదైన లాడ్జిల్లో విడివిడిగా దిగుతారు. కళ్లజోళ్లు, రంగురాళ్లు అమ్మడానికి వచ్చినట్లు అందరినీ నమ్మిస్తారు. ఈ ముఠాకే చెందిన కొందరు రోడ్డు మార్గంలో ద్విచక్ర, తేలికపాటి వాహనాలనూ తీసుకుని వస్తారు.
వెంటే నకిలీ వస్తువులు...
సూడోల అవతారంలో ప్రజల్ని మోసం చేసేందుకు వీరు తమ వెంట నకిలీ బంగారు గాజులు, పుస్తెల తాడులు, నగలు, రంగు రాళ్లను తెచ్చుకుంటారు. రెక్కీ చేసి నేరం చేయడానికి అనువుగా ప్రాంతాన్ని గుర్తించి.. టార్గెట్‌లను ఎంచుకున్న తర్వాత పోలీసులుగా రంగంలోకి దిగి, జాగ్రత్తలు చెప్తున్నట్లు నటిస్తూ దోచుకుంటారు. సాధారణ ప్రజలను తేలిగ్గా బట్టులో వేసుకోవడానికి ఖాకీ రంగు లేదా అదే షేడ్స్‌తో ఉన్న ప్యాంట్లు, జర్కిన్లు, బెల్టులు, రేబాన్ కళ్లద్దాలు ధరిస్తారు. పోలీసులకు తమపై అనుమానం రాకుండా ఉండేందుకు చొక్కాలను మాత్రం సాధారణ రంగులవే వేసుకుంటారు. దృష్టి మరల్చి సొత్తు కాజేయడంతో పాటు చైన్‌స్నాచింగ్స్ కూడా పాల్పడుతుంటారు.
భార్యల సహకారంతో విక్రయం...
‘పని’ పూర్తయ్యాక సూడో పోలీసులు నేరస్థలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న బైక్, తేలికపాటి వాహనాల్లో ఉడాయిస్తాయి. చోరీ సొత్తును తమ ప్రాంతాలకు తీసుకెళ్లి, భార్యల ద్వారా తమవే అని చెప్పించి విక్రయించి సొమ్ము చేసుకుంటారు. గత నెల్లో ఒకే రోజు నగరంలోని తొమ్మిది చోట్ల పంజా విసిరిన సూడో పోలీసులు అరకేజీకి పైగా బంగారం ఎత్తుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు కమిషనర్ సీసీఎస్ అధికారుల నేతృత్వంలో ఏడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపారు. ఇన్‌స్పెక్టర్లు వి.శ్యాంబాబు, పి.రాజు, ఎంబీ శ్రీధర్, రమేష్, అర్జున్, కె.సుబ్బరామిరెడ్డి, మధుమోహన్‌రెడ్డి ఏకకాలంలో దాడులు చేసి తొమ్మిది మందిని పట్టుకున్నారు. చోరీ సొత్తు రికవరీ కోసం కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. చిక్కిన గ్యాంగులకు సంబంధించి పరారీలో ఉన్న వారితో పాటు నగరంలో పంజా విసురుతున్న మరికొన్ని ముఠాల కోసం గాలింపు కొనసాగుతోందని డీసీపీ రంగారావు తెలిపారు.
దాడులు చేసిన ప్రాంతాలివీ..
రాష్ట్రంలోని గుంతకల్, వాయల్పాడు, మదనపల్లి, హిందూపూర్
కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, బెంగళూరు, గదర్
మహారాష్ట్రలోని ముంబ్రా, భివండి, అంబేవలి, శివాజీనగర్, లోని, కౌసా, హరాప్సర్, నాగ్‌పూర్
మధ్యప్రదేశ్‌లోని పివరియా
అరెస్టు చేసింది వీరినే...
అబాలు జాఫర్ ఇరానీ, ఔలాద్ హుస్సేన్, ఖాదిమ్ హుస్సేన్, మాషల్లా గరీబ్ షా సయ్యద్, మొహ్మద్ అలీ, అబ్బాస్ అలీ, సాధిక్ హుస్సేన్, మొగల్ అబ్బాస్ అలీ, సయ్యద్ జాఫర్ అలీ