మైలార్‌దేవ్‌పల్లిలో ఘటన
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ గృహిణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను రక్షించే క్రమంలో భర్త, కుమారుడు మృత్యువాత పడ్డారు. ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలను ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. కిరాణా స్టోర్ నడుపుకొనే మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మీగూడకి చెందిన ఎలుక కృష్ణగౌడ్(34), సరిత(27) దంపతులు. వీరికి అక్షిత(5), ఐశ్వర్య(3), అశ్విన్ (ఏడాదిన్నర) సంతానం.
కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్న వీరి కుటుంబంలో కలహాలు తలెత్తాయి. ఈ క్రమంలో సరిత శుక్రవారం రాత్రి భర్తతో గొడవ పడ్డారు. గొడవ పెరిగి పెద్దదై, చివరకు జీవితంపై విరక్తిచెందిన సరిత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
రక్షించేందుకు వెళ్లిన భర్తను సరిత గట్టిగా పట్టుకోవడంతో అతడికి, పక్కనే ఉన్న అశ్విన్‌కు మంటలు అంటుకున్నాయి. చిన్నారి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశ్విన్ మరణించాడు. ఘటనా స్థలిలోనే ఉన్న అక్షిత, ఐశ్వర్యలకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రుల మృతితో కుమార్తెలిద్దరూ అనాథలయ్యారు. స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి సానెం శ్రీనివాస్‌గౌడ్ తదితరులు మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.