ఏమిటీ ఘోరం
సాక్షి, సిటీబ్యూరో: తమ బిడ్డల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటేనే అల్లాడిపోయే తల్లిదండ్రులు... పిల్లల కళ్లలో నీరు కనిపిస్తేనే విలవిలలాడే తల్లిదండ్రులు... అమ్మ కనిపించలేదనో... నాన్న దూరంగా ఉన్నారనో బాధ పడితేనే తట్టుకోలేని హృదయాలు... ఉన్నట్టుండి కఠినంగా మారిపోతున్నాయి. బిడ్డల గురించి అంతగా తపించిపోయే తల్లిదండ్రులే విచక్షణ కోల్పోతున్నారు. చిన్నారులకు మరణ శాసనం రాస్తున్నారు.
తాజాగా రాఘవేంద్ర గురుప్రసాద్ ఉదంతం ఈ కోవలోకే వస్తుంది. ఇక్కడే కాదు... నిత్యం ఎక్కడో ఓ చోట రాఘవేంద్ర గురుప్రసాద్‌లు, మనీష్ సాహూల లాంటి వారు కనిపిస్తున్నారు. సమాజంలో మంచి హోదాల్లో ఉంటున్నవారే ఈ ఘాతుకాలకు పాల్పడడం విస్తుగొల్పుతోంది. భార్యాభర్తల మధ్యనో... కుటుంబ సభ్యుల నడుమనో తలె త్తేవిబేధాలకు అభం శుభం తెలియని చిన్నారులు సమిధలవుతున్నారు. అన్నీ అవుతారనుకున్న అమ్మానాన్నలే పిల్లల నుదుటి గీతను చెరిపేస్తున్నారు.
ఒంటరి కుటుంబాలు, దాంపత్య సంబంధాల్లో పెరిగిన డొల్లతనం... అనవసర పంతాలు పిల్లల ప్రాణాలను హరిస్తున్నాయి. ఉన్నత విద్యావంతుడు, ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గురుప్రసాద్ విచక్షణ కోల్పోయి బిడ్డలను పొట్టన పెట్టుకోవడమే కాక...తానూ ఆత్మహత్యకు ఒడిగ ట్టడం విచారకరం. గతంలో నగరంలోని ఇమోమెంటస్ కంపెనీలో చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మనీష్ సాహు సైతం ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడు. తన భార్య శ్వేతసాహుతో తలెత్తిన గొడవల కారణంగా ఆమెతో పాటు, ఐదేళ్ల కొడుకు యాష్‌ను హతమార్చాడు. తరువాతతానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.