'మూడేళ్లుగా భార్యాభర్తలకు పడటంలేదు'
హైదరాబాద్ : భార్యాభర్తల కలహాలే ముగ్గురు ఉసురు తీశాయని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మాదాపూర్‌లో నివాసముండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మనీష్ షాహు.. తన భార్య శ్వేతసాహు, ఐదేళ్ల కుమారుడు యాష్‌లను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. ముగ్గురి మృతి విషయం తెలిసి మనీష్ షాహు తండ్రి కేఆర్ షాహు, సోదరుడు ఆశీష్‌తో పాటు శ్వేత తండ్రి ఉమేశ్ చంద్ర గుప్తా మురాదాబాద్ నుంచి నగరానికి వచ్చారు. దంపతుల మధ్య కలహాలే ఈ ఘోరానికి కారణమని రోదించారు.
2006లో మనీష్, శ్వేతలకు పెళ్లైందని.. మొదటి నుంచి ఇద్దరికీ పడేది కాదని, ఒకరి మాటకు ఒకరు విలువ ఇచ్చేవారు కాదని పోలీసులకు తెలిపారు. మద్యం తాగే అలవాటు ఉన్న మనీష్ స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చేవాడని, ఆ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేదన్నారు. రెండు నెలల క్రితం శ్వేత భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయన్నారు. నాలుగు రోజులుగా దంపతులిద్దరికీ ఫోన్ చేసి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయిందని వారు అన్నారు.
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగి.. ముగ్గురి ప్రాణాలను బలితీసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పి రోదించారు. కాగా, గురువారం పోస్టుమార్టం అనంతరం మనీష్, శ్వేత, చిన్నారి యాష్‌ల మృతదేహాలను పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించగా.. అంబర్‌పేట శ్మశాన వాటికలో ఖననం చేశారు.