manish sahu
-
అనుబంధమా... బలి కోరొద్దు!
పిల్లలను చంపి పెద్దలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలొ ఎక్కువయ్యాయి. తల్లిదండ్రుల మధ్య గొడవల్లో పిల్లలు బలిపశులవుతున్న దారుణోదంతాలు అధికమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యావంతులు కూడా విచక్షణ కోల్పోయి ఇలాంటి ఘోరాలకు పాల్పడుతుండడం మరింత భయాందోళన కలిగిస్తోంది. కడప, హైదరాబాద్ లలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఘటనలు వర్తమాన సమాజ విపరీత వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి. జూన్ 26న ఉత్తరప్రదేశ్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మనీష్ సాహూ(36) తన భార్య శ్వేతతో పాటు కుమారుడు యష్(5)ను కిరాతకంగా చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని మైహోమ్ అపార్ట్మెంట్ లో అతడీ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన ఇద్దరు కొడుకులను చంపి, పాతిపెట్టి తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. కడపలో కృపాకర్ అనే వ్యక్తి భార్యాపిల్లలను తాను కూడా తనువు చాలించాడు. ఆర్థిక, వివాహేతర సంబంధాలు ఆలుమగల మధ్య వివాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. విద్యావంతుల విషయానికి వచ్చేసరికి వృతిపరమైన ఒత్తిడి, అహం, ఆధునిక జీవనవిధానం తదితర కారణాలు కాపురాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనన్న భావన కొరవడిన కుటుంబాలు కల్లోలాల బారిన పడుతున్నాయి. ఆధిపత్య ధోరణి ఆలుమగల మధ్య అగాధం పెంచుతోంది. మరోపక్క వృత్తిపరమైన ఒత్తిడి కూడా వైవాహిక సంబంధాల విచ్ఛిన్నానికి కారణమవుతోంది. సాఫీగా సాగిపోతున్న సంసారంలో కలతలు ఏర్పడితే జీవితాలు తారుమారవుతున్నాయి. దాంపత్య గొడవలతో భార్యాభర్తలు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. తీవ్రమనోవేదనకు లోనయి క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రక్తంపంచుకు పుట్టినవారిని, జీవితాన్ని పంచుకున్న వారిని కడతేర్చి.. తమ జీవితాన్ని అర్థాంతంగా ముగించేందుకు వెనుకాడని నిస్సృహలోనికి కూరుకుపోతున్నారు. ప్రతిసమస్యకు పరిష్కారం ఉంది. అయితే సమస్యను గుర్తించి, దానికి తగిన పరిష్కారం చేయనప్పుడే ఉపద్రవాలు ఎదురవుతున్నాయి. ఆలుమగల మధ్య అనుబంధం బలంగా ఉంటే సమస్యలు వాటికవే సమసిపోతాయి. -
ఏమిటీ ఘోరం
సాక్షి, సిటీబ్యూరో: తమ బిడ్డల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటేనే అల్లాడిపోయే తల్లిదండ్రులు... పిల్లల కళ్లలో నీరు కనిపిస్తేనే విలవిలలాడే తల్లిదండ్రులు... అమ్మ కనిపించలేదనో... నాన్న దూరంగా ఉన్నారనో బాధ పడితేనే తట్టుకోలేని హృదయాలు... ఉన్నట్టుండి కఠినంగా మారిపోతున్నాయి. బిడ్డల గురించి అంతగా తపించిపోయే తల్లిదండ్రులే విచక్షణ కోల్పోతున్నారు. చిన్నారులకు మరణ శాసనం రాస్తున్నారు. తాజాగా రాఘవేంద్ర గురుప్రసాద్ ఉదంతం ఈ కోవలోకే వస్తుంది. ఇక్కడే కాదు... నిత్యం ఎక్కడో ఓ చోట రాఘవేంద్ర గురుప్రసాద్‌లు, మనీష్ సాహూల లాంటి వారు కనిపిస్తున్నారు. సమాజంలో మంచి హోదాల్లో ఉంటున్నవారే ఈ ఘాతుకాలకు పాల్పడడం విస్తుగొల్పుతోంది. భార్యాభర్తల మధ్యనో... కుటుంబ సభ్యుల నడుమనో తలె త్తేవిబేధాలకు అభం శుభం తెలియని చిన్నారులు సమిధలవుతున్నారు. అన్నీ అవుతారనుకున్న అమ్మానాన్నలే పిల్లల నుదుటి గీతను చెరిపేస్తున్నారు. ఒంటరి కుటుంబాలు, దాంపత్య సంబంధాల్లో పెరిగిన డొల్లతనం... అనవసర పంతాలు పిల్లల ప్రాణాలను హరిస్తున్నాయి. ఉన్నత విద్యావంతుడు, ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గురుప్రసాద్ విచక్షణ కోల్పోయి బిడ్డలను పొట్టన పెట్టుకోవడమే కాక...తానూ ఆత్మహత్యకు ఒడిగ ట్టడం విచారకరం. గతంలో నగరంలోని ఇమోమెంటస్ కంపెనీలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మనీష్ సాహు సైతం ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడు. తన భార్య శ్వేతసాహుతో తలెత్తిన గొడవల కారణంగా ఆమెతో పాటు, ఐదేళ్ల కొడుకు యాష్‌ను హతమార్చాడు. తరువాతతానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
'మూడేళ్లుగా భార్యాభర్తలకు పడటంలేదు'
హైదరాబాద్ : భార్యాభర్తల కలహాలే ముగ్గురు ఉసురు తీశాయని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మాదాపూర్‌లో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మనీష్ షాహు.. తన భార్య శ్వేతసాహు, ఐదేళ్ల కుమారుడు యాష్‌లను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. ముగ్గురి మృతి విషయం తెలిసి మనీష్ షాహు తండ్రి కేఆర్ షాహు, సోదరుడు ఆశీష్‌తో పాటు శ్వేత తండ్రి ఉమేశ్ చంద్ర గుప్తా మురాదాబాద్ నుంచి నగరానికి వచ్చారు. దంపతుల మధ్య కలహాలే ఈ ఘోరానికి కారణమని రోదించారు. 2006లో మనీష్, శ్వేతలకు పెళ్లైందని.. మొదటి నుంచి ఇద్దరికీ పడేది కాదని, ఒకరి మాటకు ఒకరు విలువ ఇచ్చేవారు కాదని పోలీసులకు తెలిపారు. మద్యం తాగే అలవాటు ఉన్న మనీష్ స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చేవాడని, ఆ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేదన్నారు. రెండు నెలల క్రితం శ్వేత భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయన్నారు. నాలుగు రోజులుగా దంపతులిద్దరికీ ఫోన్ చేసి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయిందని వారు అన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగి.. ముగ్గురి ప్రాణాలను బలితీసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పి రోదించారు. కాగా, గురువారం పోస్టుమార్టం అనంతరం మనీష్, శ్వేత, చిన్నారి యాష్ల మృతదేహాలను పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించగా.. అంబర్‌పేట శ్మశాన వాటికలో ఖననం చేశారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
భార్య, కొడుకును హత్య చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య గచ్చిబౌలిలో దారుణం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షకు పైగా జీతం.. ఇంతకన్నా ఏం కావాలి? లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవి తాన్ని అర్ధాంతరంగా ముగించాడు. కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కడతేర్చి తానూ ఉరివేసుకున్నాడు. బుధవారం వెలుగు చూసిన ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌కు చెందిన మనీష్ సాహు (35) మూడేళ్ల కిందట నగరానికి వచ్చాడు. మాదాపూర్‌లోని ఇమోమెంటస్ కంపెనీలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మాదాపూర్‌లోనే మై హోమ్ నవద్వీప్ వరుణ బ్లాక్‌లోని ఫ్లాట్ నెం 108లో భార్య శ్వేత సాహు (32), కొడుకు యశ్ (5)తో కలసి అద్దెకుంటున్నాడు. శ్వేత గృహిణి కాగా, యశ్ మెరిడియన్ స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. ఈనెల 19న ఆఫీస్‌కు వెళ్లి వచ్చిన మనీష్ శుక్రవారం నుంచి ఆఫీస్‌కు వెళ్లలేదు. బుధవారం ప్రాజెక్ట్ డెలివరీ ఉండటంతో కంపెనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ శ్రీరామ్.. మనీష్ నివాసానికి వచ్చి చూడగా డోర్ వెనక నుంచి గడియపెట్టి ఉంది. కిటికీ తలుపులు తెరచి చూడగా తీవ్ర దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ నిర్వాహకులకు విషయం చెప్పారు. వారు వచ్చి కిటికీలోంచి చూడగా మనీష్ కిటికీకి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా శ్వేత, కొడుకు యశ్‌లు మంచంపై నిర్జీవంగా పడిఉన్నారు. మనీష్ నైలాన్ తాడుతో కిటికీకి ఉరివేసుకున్నాడు. ముగ్గురి శరీర భాగాలు ఉబ్బిపోయి ఉండడంతో నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. భార్య శ్వేత రెండుచేతుల మణికట్టుపై పదునైన కత్తితో కోయగా తీవ్ర రక్తస్రావమైనట్టుగా ఉంది. కొడుకు యశ్ తలకు, ముక్కు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి కొడుకును హతమార్చినట్లు తెలుస్తుంది. వారిద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను రెండు చేతుల మణికట్టుపై కోసుకున్న మనీష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు తెలిపారు. మనీష్, శ్వేత కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఠాణాకీడ్చిందని..?: రెండు నెలల నుంచి దంపతుల మధ్య ఏదో ఒక విషయుంపై గొడవలు జరుగుతున్నారుు. భర్త తనను వేధిస్తున్నాడని శ్వేత మాదాపూర్ పోలీసులను ఆశ్రరుుంచింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ చేసి పంపించారు. తనను పోలీసు స్టేషన్ కీడ్చిందని భార్యపై మరింత కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. -
భార్యాబిడ్డలను చంపి సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!
హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్‌లోని మైహోం అపార్ట్మెంట్లో విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొడుకుతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ మనీష్ సాహు, అతని భార్య శ్వేతాసాహు, మూడేళ్ల కుమారుడు యాష్ సాహులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మనీష్ సాహు గత నాలుగు రోజుల నుంచి విధులకు హాజరు కాకపోవటంతో తోటి ఉద్యోగులు అతని నివాసానికి వచ్చారు. వారు నివాసం ఉంటున్న 108 ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు ఎంతకి తెరవకపోవడంతో పగులకొట్టి చూడగా సాహు కుటుంబీకులు విఘత జీవులుగా కనిపించారు. మృతదేహాలు ఉన్న పరిస్థితిని బట్టి ఆత్మహత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనా. వారంతంలో సాహు దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తల్లీకొడుకులు రక్తపు మడుగులో ఉండగా, సాహు అదే గదిలో కిటికీకి ఉరేసుకుని ఉన్నాడు. సాహు ముందుగా భార్యాబిడ్డలను హతమార్చి అనంతరం తాను ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.