ఉత్సవం.. ఉత్సాహం | Festival .. Ardor | Sakshi
Sakshi News home page

ఉత్సవం.. ఉత్సాహం

Published Mon, Sep 9 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

ఉత్సవం.. ఉత్సాహం

ఉత్సవం.. ఉత్సాహం

సాక్షి, సిటీబ్యూరో/భోలక్‌పూర్, న్యూస్‌లైన్: నగరం ఉత్సవ శోభ సంతరించుకుంది. వినాయక చవితి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరంలో ఆబాలగోపాలాన్ని ఆనందింప చేసే అపురూప, అతిపెద్ద సామూహిక ఉత్సవాలు గణపతి నవరాత్రులే. ప్రత్యేకించి ‘గణపతి బప్పా మోరియా..’ అని స్మరిస్తూ ఆధ్యాత్మిక చైతన్యంతో ఊగిపోయే విద్యార్థులు, యువత ఉత్సాహానికి ఈ ఉత్సవాలు ప్రతీకగా నిలవనున్నాయి. ఇక, సోమవారం నాటి చవితి వేడుకల నిమిత్తం నగరవాసులు ఆదివారం తారస్థాయిలో కొనుగోళ్లు జరిపారు. ఫలాలు, పత్రి, పూలు ఇతర పూజా సామగ్రి అమ్మకాలు హోరెత్తాయి.

కొనుగోలుదారులతో  నగరం కిటకిటలాడింది. మండపాలకు విగ్రహాల తరలింపు పెద్ద ఎత్తున కొనసాగింది. మహానగరం పరిధిలోని కాలనీలు, బస్తీలు, వీధుల్లో ఈసారి 50 వేల నుంచి 80 వేల వరకు గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారని అంచనా. ఇళ్లలో ప్రతిష్ఠించేవి వీటికి అదనం. పర్యావరణ స్పృహ పెరగటంతో ఈసారి నగరవాసులు మట్టి ప్రతిమలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు వీటి పంపిణీపై శ్రద్ధపెట్టాయి.

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇళ్లలో పూజల నిమిత్తం 20 వేలు, మండపాల్లో ప్రతిష్ఠించేందుకు 150 (ఐదడుగుల) మట్టి విగ్రహాలను విక్రయించాయి. హెచ్‌ఎండీఏ చిన్నవి 30 వేలు, మూడడుగుల ఎత్తున్నవి 300 ప్రతిమలను విక్రయించింది. లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద 60 అడుగుల మట్టి వినాయక విగ్రహం ఆకట్టుకుంటోంది. నవరాత్రి పూజల అనంతరం అక్కడే నిమజ్జనం చేయటం ఇక్కడి ప్రత్యేకత.  ఇక 59 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడు ఎలాగూ ప్రత్యేక ఆకర్షణే. పలుచోట్ల ఆకట్టుకునే రీతిలో, విభిన్న శైలిలో విగ్రహాలను రూపుదిద్దారు.

 ఆకర్షిస్తున్న మండపాలు

 గౌలిపురా, మెహిదీపట్నం, సైదాబాద్, పాతనగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న మండపాలను మహారాష్ట్ర, కోల్‌కతా నుంచి తరలి వచ్చిన కళాకారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల తిరుపతి దేవస్థానం, పూరి గుడి, కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం.. ఇలా దేశంలో ప్రముఖ ఆలయాలను పోలిన మండపాల డిజైన్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మరోపక్క హుస్సేన్‌సాగర్ నిమజ్జన ఘట్టానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది సాగర్‌లో 25 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అంచనా. మూడో రోజైన బుధవారం నుంచే ఈ సందడి ప్రారంభమవుతుంది. ఈ లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. సాగర్ వద్ద, ఖైరతాబాద్ గణేషుడి వద్ద ఏర్పాట్లను మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

 ఉత్సాహమే కానీ.. ధరలతో బెంబేలు

 భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి పండగ ఖర్చు భారంగానే పరిణమించనుంది. ఈసారి ఫలం, పత్రం, పుష్పం వంటి పూజా సామగ్రి ధరలు చుక్కలను తాకాయి. మంటపాల అలంకరణ, శోభాయాత్ర, పురోహితుడి సంభావనలు సైతం పెరిగాయి. మొత్తంగాగతేడాదితో పోలిస్తే అన్నింటి ధరలు సుమారు 50 శాతం పెరిగాయని మార్కెట్ వర్గాల అంచనా. పెరిగిన ధరలతో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, వినాయక మండపాల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. వినాయకుడి ప్రతిమల ధరలు ఈసారి భారీగా పెరిగాయి. ధూల్‌పేట, నాగోలు, ఉప్పల్, హయత్‌నగర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో రూ. 2 వేల నుంచి ప్రారంభమై రూ. లక్ష  విలువచేసే విగ్రహాలు లభ్యమౌతున్నాయి. ఒకటిన్నర అడుగులుండే ప్రతిమ రూ.1500కు లభ్యమౌతుంది. ఐదారడుగులు మించితే ధర వేలల్లోనే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement