
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం
హైదరాబాద్: నగరంలోని నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో శుక్రవారం ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన మజ్జిగ రజిత(24), సమ్మయ్య(29) దంపతులు బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. 2010లో వీరి వివాహం జరుగగా.. మొదటి కాన్పుగా లాస్యశ్రీ(3) జన్మించింది. రెండో కాన్పు కోసం రజిత గురువారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం ఉదయం నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అందులో ముగ్గురు మగ శిశువులు, ఒక ఆడ శిశువు ఉన్నారు.
వీరంతా 1.6-1.75 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ లీనా కనుంగో మాట్లాడుతూ ఈఎస్‌ఐ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఒక మహిళకు ఆపరేషన్ చేసి నలుగురు పిల్లలకు జన్మనివ్వడం జరిగిందన్నారు. 76 గంటల పాటు శిశువులను ఐసీయూలో ఉంచాలని చెప్పారు. కాగా ఒకే కాన్పులో నలుగురు శిశువులు పుట్టడం పట్ల తండ్రి సమ్మయ్య ఆనందం వ్యక్తం చేశారు. సమ్మయ్య విద్యానగర్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నాడు.