హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలో విషాదం
హైదరాబాద్: నగరంలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలోని మ్యాన్హోల్లో పడి నలుగురు కార్మికులు మృతి చెందారు. మెట్రో వాటర్ వర్స్క్ పనుల్లో భాగంగా మ్యాన్హోల్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మ్యాన్హోల్ లోతు ఎక్కువగా ఉండడంతో పాటు విషవాయువుల కారణంగా మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కార్మికులను ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్న ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కార్మికులు మృతి చెందారు. మ్యాన్హోల్లో చిక్కుకున్న వారిని కాపాడబోయి గంగాధర్ అనే వ్యక్తి మృతిచెందాడు. మృతులను ఓయూ మాణికేశ్వర్ నగర్కు చెందిన జీహెచ్ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించారు. మృతులు సత్యనారాయణ, నగేష్, చందు మృతదేహాలను వెలికితీశారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ చెప్పారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : వైఎస్సార్ సీపీ
మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని.... ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.