సాక్షి, హైదరాబాద్: అదే గ్యాంగ్... మళ్లీ అదే తరహా మోసం. తమ పిల్లలను డాక్టర్లు చేయాలన్న తల్లిదండ్రుల ఆరాటమే ఆ ముఠాకు కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో మెడికల్ పీజీ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని పలువురిని మోసగించినట్టే ఇప్పుడు కూడా సీట్ల పేరుతో ఆ ముఠా పలువురిని నిండా ముంచినట్టు తెలుస్తోంది. కర్ణాటక కేంద్రంగా సాగిన ఈ దందాలో మరోసారి రాష్ట్రంలోని పలువురు విద్యార్థులు అన్యాయమయ్యారు. కర్ణాటకలోని ప్రముఖ మెడికల్ కాలేజీలో మేనేజ్‌మెంట్ కోటాలో తక్కువ ఫీజుకే ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌నుంచి ఈ ముఠా లక్షల రూపాయలను దండుకుంది.
తక్కువ ఫీజుకే సీటు పేరుతో ఎర!
ఎంసెట్ సీజన్ రాగానే గద్దల్లా వాలిపోయే పలు నకిలీ కన్సల్టెన్సీలు విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. తక్కువ ఫీజుకే ఎంబీబీఎస్ సీటు వస్తుందంటే పక్క రాష్ట్రం అనికూడా చూడకుండా ముందే డబ్బు కట్టేస్తారు. ఇప్పుడు అదేరీతిలో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల పేరుతో కర్ణాటకకు చెందిన గ్యాంగ్ హైదరాబాద్ బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ డాక్టర్‌ను మోసం చేసింది. తమ అల్లుడికి ఎంబీబీఎస్ సీటు కోసం రూ.44 లక్షలు కట్టి మోసపోయినట్టు ఆ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు ఆ ముఠాకోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. మన రాష్ట్రంతో పాటు రాజస్తాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల పేరుతో వందలాదిమందిని మోసగించినట్లు తమ దర్యాప్తులో బయపడిందని నార్త్‌జోన్ డీసీపీ సుమతి ‘సాక్షి’కి తెలిపారు. వీరందరినుంచి వసూలు చేసిన సొమ్ము కోట్లలో ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎంసెట్ డాటా బేస్‌తోనే ఫోన్లు..
ఎంసెట్ రాసే విద్యార్థుల డాటా బేస్‌తో వారి తల్లిదండ్రులను ఈ ముఠా ఫోన్లలో సంప్రదించినట్టు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారిని బెంగళూరులోని రిడ్జ్ హోటల్‌కు పిలిపించుకున్నారు. మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు, కాలేజీల వివరాలు చెప్పి నమ్మించారు. అక్కడే వారి నుంచి కొంత నగదు తీసుకొని తర్వాత చేతులెత్తేసినట్టు తెలిపారు.
గతంలో కూడా ఇదే రీతిలో ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్సిటీలో పీజీ మెడికల్ సీట్ల స్కాం జరిగింది. గత ఏడాది కూడా సీట్లు ఇప్పిస్తామంటూ ఏకంగా ఎంసెట్ ప్రశ్నపత్రం లీక్ చేయించారు. లీకైన ప్రశ్న పత్రం ఆధారంగా విద్యార్థులను ముంబై, కోల్‌కతా, పుణే తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు.
ఎంసెట్ స్కాం నిందితులదే కీలక పాత్ర..?
డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న బొల్లారం పోలీసులు గతంలో ఇదే రీతిలో ఎంసెట్, పీజీ స్కాంలకు పాల్పడిన రాజగోపాల్‌రెడ్డి ముఠా పై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి మేనేజ్‌మెంట్ సీట్ల పేరుతో మోసం చేయడంలో దిట్ట అని చెబుతున్నారు. గత స్కాంలపై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు కూడా రాజగోపాల్‌రెడ్డి గ్యాంగ్‌పై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. దీంతో బొల్లారం, సీఐడీ పోలీసులు ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు..
మేనేజ్‌మెంట్ కోటా సీట్ల పేరుతో మోసానికి పాల్పడ్డ గ్యాంగ్ చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని హోటల్‌లో దిగిన ఈ ముఠా సభ్యులు రూం బుక్ చేసిన సందర్భంలో ఆధార్, ఓటర్ కార్డులను అడ్రస్ నిమిత్తం సమర్పించారు. అయితే దర్యాప్తులో పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయి. ముఠా సభ్యులు బస చేసిన హోటల్‌కు సమర్పించిన ఆ«ధార్, ఓటర్ కార్డులు నకిలీవని తేల్చారు.
అలాగే పలువురు తల్లిదండ్రులు నగదును బదిలీచేసిన బ్యాంక్ ఖాతా వివరాలను తనిఖీ చేయగా, కోల్‌కతాలోని ఆ బ్యాంకుకు సైతం నకిలీ డాక్యుమెంట్లు సమర్పించినట్టు తేలింది. దీనితో బొల్లారం పోలీసులు దర్యాప్తులో ముందుకెలా వెళ్లాలన్న దానిపై సీఐడీ సహాయం తీసుకుంటున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చిన నంబర్ల ఆధారంగా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment