సగం ఫోన్ కూడా కొనచ్చా?
మనం ఆన్‌లైన్‌లో ఏమైనా కొనాలంటే ఎన్ని కావాలనే 'క్వాంటిటీ' అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందులో కనీసం 1 నుంచి మొదలుపెట్టి, మనకు ఎన్ని కావాలో చెప్పాలి. సాధారణంగా ఫోన్లలాంటివి అయితే ఒక ఈమెయిల్ ఐడీ నుంచి ఒకటి కంటే ఎక్కువ కొనే అవకాశం ఉండదు కాబట్టి కేవలం 1 అనే అంకె మాత్రమే అక్కడ వేయాల్సి ఉంటుంది. కొన్ని ఈ-కామర్స్ సైట్లయితే డీఫాల్ట్‌గానే 1 అనే క్వాంటిటీ అక్కడ పేర్కొంటాయి. దాన్ని మార్చడానికి కూడా ఉండదు. అదే, ఇతర వస్తువులు గానీ, దుస్తులు గానీ అయితే ఒకటి కంటే ఎక్కువ కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కానీ.. ఎప్పుడైనా సగం వస్తువు ఆర్డర్ చేయడానికి మీరు ప్రయత్నించారా? అసలు అలా కుదురుతుందో లేదో చూశారా? భారతదేశాన్ని.. ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తాన్ని ఊదరగొడుతున్న 'ఫ్రీడం 251' ఫోన్ మాత్రం సగం కూడా బుక్ చేయొచ్చట. ఈ విషయాన్ని సాంకేతిక నిపుణులు గుర్తించారు. వాస్తవానికి వెబ్‌సైట్ రూపకల్పన చేసేటప్పుడే.. దానికి సంబంధించిన ఆల్గరిథమ్ సరిగ్గా రూపొందించుకోవాలి. 'మినిమమ్' అనే లాజిక్ ఒకటి ఇవ్వాలి. కానీ అది సరిగా ఇవ్వకపోవడంతో ఇలా సగం ఫోన్ కూడా బుక్ చేసుకోడానికి 'ఫ్రీడమ్ 251' అవకాశం కల్పించిందని తెలుస్తోంది.
మళ్లీ సైట్ గోవిందా
తొలిరోజు గురువారం నాడు సెకనుకు 6 లక్షల మంది తమ సైట్‌ను సందర్శించారని, అంత భారాన్ని సెర్వర్లు తట్టుకోలేకపోవడం వల్లే అది పనిచేయకుండా పోయిందని రింగింగ్‌బెల్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ శుక్రవారం కూడా సైట్ సగం సగమే పనిచేసింది. ఉదయం కాసేపటి వరకు బాగానే ఉండి, బుకింగ్ కూడా అయింది గానీ.. ఆ తర్వాత మధ్యాహ్నం ప్రయత్నించినవాళ్లకు సైట్ మొత్తం ఖాళీగా తెల్లగా కనిపించడం మొదలైంది. అసలు ఎలాంటి ఎర్రర్ మెసేజి గానీ, అక్కడి నుంచి రీడైరెక్ట్ కావడం గానీ ఏమీ లేదు. దాంతో వినియోగదారులు విసుగెత్తి ఊరుకున్నారు.