నియోజకవర్గ ఇన్‌చార్జీలకు నిధులా?
♦ ప్రత్యేక అభివృద్ధి నిధిపై దద్దరిల్లిన అసెంబ్లీ
♦ పలుమార్లు విపక్ష నేత మైక్ కట్..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) నుంచి నిధుల విడుదలలో విపక్ష సభ్యుల పట్ల ప్రభుత్వం చూపుతున్న పక్షపాత వైఖరిపై బుధవారం శాసనసభ దద్దరిల్లింది. ఎస్‌డీఎఫ్ నుంచి నిధుల కేటాయింపుల తీరుపై మాట్లాడేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మైక్ ఇచ్చినట్టే ఇచ్చి స్పీకర్ కట్ చేస్తుండటంతో ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్‌డీఎఫ్ కేటాయింపుల్లో వివక్షపై వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి పథకం(ఏసీడీపీ)తో దీనికి సంబంధం లేదని ఎస్‌డీఎఫ్‌ను ముఖ్యమంత్రి విచక్షణాధికారం ప్రకారం ఇస్తారని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించడాన్ని ప్రతిపక్షనేత జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలకు మేలు చేయడానికి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని జగన్ చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నపుడు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ప్రతి ఎమ్మెల్యేకి రూ. 50 లక్షలు ఉండేదని జగన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుల కామెంట్లపై స్పందించిన ప్రతిపక్షనేత ‘తెలియకపోతే తెలుసుకోండి. మిడి మిడి జ్ఞానంతో మాట్లాడకూడదు.
మీ చంద్రబాబు నాయుడి దగ్గర నుంచి మీదాకా అన్నీ ఇవే అలవాట్లు’ అని చురకలు వేశారు. ఎంపీలకు పార్టీతో సంబంధం లేకుండా రూ. 5 కోట్ల అభివృద్ధి ఫండ్ ఇస్తారని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం ఎస్‌డీఎఫ్ అని చెప్పి ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలకు నిధులు ఇస్తున్నారని చెప్పారు. ఎస్‌డీఎఫ్ నుంచి నిధుల విడుదలపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన పేర్లే చదువుతాను. మీరిచ్చిన జీవోలు కూడా చూపిస్తా అంటూ జగన్ జీవో కాపీలు చూపుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. పేర్లు చదివి వాకౌట్ చేస్తానని విపక్షనేత చెప్పినా వినలేదు. దీనికి నిరసనగా వైసీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయడంతో మళ్లీ విపక్షనేతకు మైక్ ఇచ్చారు. ఇలా ప్రతిపక్షనేత మైక్‌ను పది నిమిషాల్లోనే అరనిమిషానికి ఒకసారి చొప్పున నాలుగు సార్లు మైక్ కట్ చేసిన స్పీకర్ చివరకు సభను పది నిమిషాలు వాయిదా వేశారు.
సర్కారును నిలదీసిన ప్రతిపక్షం
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏమైనా రాజ్యాంగబద్ధమైన పదవా? ప్రజలెన్నుకున్న ఎమ్మెల్యేని పక్కన పెట్టి అధికార పక్షానికి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేల పేరుతో నిధులెలా ఇస్తారు? పొరుగు రాష్ట్రాల్లో ఏసీడీపీ వాటా పెంచుతుంటే ఇక్కడ టీడీపీ వారికే నిధులిస్తారా? సీఎం ఉన్నది టీడీపీకా? రాష్ట్రానికా? అంటూ ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నిలదీశారు. ఏసీడీపీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్‌డీఎఫ్ నిధుల విడుదలకు అనుసరిస్తున్న విధానం గురించి వైఎస్సార్ సీపీ సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించగా బుడ్డా రాజశేఖరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు అనుబంధ ప్రశ్నలు సంధించారు.
నిధుల్లేవంటే ప్రభుత్వానికి అప్రదిష్టే: విష్ణుకుమార్‌రాజు
రాష్ట్రంలోని శాసనసభ్యులంతా వారి నియోజవర్గ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని బీజేపీ పక్షనేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. ప్రజలు చిన్న చిన్న పనులు అడిగితే నిధులు లేవని చెబితే శాసనసభ్యులకే కాదు ప్రభుత్వానికి కూడా అప్రదిష్టేనన్నారు. అందువల్ల ప్రతి నియోజకవర్గానికి ఎంతో కొంత నిధి పెట్టే ఏర్పాటు చేయాలని చెప్పారు.