పాలీసెట్ ప్రశాంతం
97 శాతం మంది హాజరు
నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేకపోయిన పలువురు విద్యార్థులు
సిటీబ్యూరో: ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం నిర్వహించిన పాలీసెట్-2016 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జంట నగరాల్లో 30,444 మందికి గాను 30,010 (97 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 65 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రారంభ సమయం ఉదయం 11 గంటలకు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ముందే చెప్పినా... పలుచోట్ల అభ్యర్థులు ఆలస్యంగా వెళ్లారు. ఫలితంగా వారిని అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతూ ఇంటి దారి పట్టారు.
నిరాశ..
కంటోన్మెంట్: నిమిషం ఆలస్యం నిబంధన ఓ విద్యార్థి పరీక్ష రాసే అవకాశం కోల్పోయేలా చేసింది. మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని పరీక్షా కేంద్రానికి అఖిల్ అనే విద్యార్థి ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. అఖిల్ ఎంత వేడుకున్నా నిబంధనలకు విరుద్ధంగా తాము పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.