గ్రావిటీ’ సర్వే మరింత జాప్యం | Gravity 'survey is much delayed | Sakshi
Sakshi News home page

గ్రావిటీ’ సర్వే మరింత జాప్యం

Published Tue, Aug 15 2017 3:07 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

గ్రావిటీ’ సర్వే మరింత జాప్యం

గ్రావిటీ’ సర్వే మరింత జాప్యం

తమ్మిడిహెట్టి–సుందిళ్లపై ముందుకు కదలని వ్యాప్కోస్‌ సర్వే
నీటి పారుదల శాఖ నిర్లక్ష్యంతో ఆలస్యం
ప్రస్తుతం వర్షాలతో సర్వే కొనసాగించలేని పరిస్థితి  


సాక్షి, హైదరాబాద్‌: ప్రాణహిత ప్రాజెక్టులో భాగమైన తమ్మిడిహెట్టి నుంచి.. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల బ్యారేజీకి గ్రావిటీ ద్వారా నీటిని తరలించడంపై చేపట్టిన సర్వే ముందుకు కదలడం లేదు. సర్వే బాధ్యత లను చూస్తున్న వ్యాప్కోస్‌ సంస్థ ఈ పనులపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఏడాదిగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నీటి పారుదల శాఖ కూడా పట్టనట్లు వ్యవహరించడంతో మరింత జాప్యం జరిగింది. తాజాగా ఈ సర్వేను తిరిగి మొదలు పెట్టాలని చూసినా.. వాతావరణం అనుకూ లంగా లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది.

భారీ విద్యుత్‌ అవసరంతో..
ప్రాణహిత తొలి డిజైన్‌ మేరకు తమ్మిడిహెట్టి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి 72 కిలోమీటర్ల మేర గ్రావిటీ, తర్వాత చిన్న లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రణాళిక వేశారు. కానీ తమ్మిడిహెట్టి వద్ద తగిన నీటి లభ్యత ఉండదన్న కేంద్ర జల సంఘం సూచనతో.. కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. అయితే దీనితో విద్యుత్‌ అవసరాలు భారీగా పెరగడంతో గ్రావిటీ ద్వారా తరలింపు అంశం తెరపైకి వచ్చింది. వీలైనంత ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా 72వ కిలోమీటర్‌ వరకు తెచ్చి.. అక్కడి నుంచి వేరే కాల్వ ద్వారా సుందిళ్ల బ్యారేజీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది.

దీని సర్వే బాధ్యతలను ఏడాది కింద వ్యాప్కోస్‌కు కట్టబెట్టారు. 72వ కిలోమీటర్‌ పాయింట్‌ నుంచి సుందిళ్లకు నీటిని తరలించే వ్యవస్థపై ఈ సంస్థ లైడార్‌ సర్వే చేయాల్సి ఉంది. గతేడాది మేలో సర్వే మొదలుపెట్టిన వ్యాప్కోస్‌.. ఈ అలైన్‌మెంట్‌ అంత సులువు కాదని, దారిలో అనేక గనులున్నాయని స్పష్టం చేసింది. దీనిపై లోతైన సర్వే చేయాలని పేర్కొంది. కొద్దిరోజులకే సర్వే చేస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత హెలికాప్టర్‌ సిద్ధమైనా జూన్‌ నుంచి విస్తారంగా కురుస్తున్న వానలతో సర్వేకు బ్రేక్‌ పడింది. మరోవైపు కొద్దినెలలుగా రాష్ట్రంలోని పలు ఇతర ప్రాజెక్టుల సర్వే పనులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రాణహిత సర్వే మూలనపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement