మీరే గ్రేట్ టీమ్ మెంబర్! | Great Team member for yourself | Sakshi
Sakshi News home page

మీరే గ్రేట్ టీమ్ మెంబర్!

Published Thu, Jul 24 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

మీరే గ్రేట్ టీమ్ మెంబర్!

మీరే గ్రేట్ టీమ్ మెంబర్!

ఒక సంస్థ విజయవంతంగా ముందుకు సాగాలంటే ప్రధానంగా కావాల్సింది.. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు. సంస్థలో ఉద్యోగులు బృందాలుగా ఏర్పడి తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు. బృందంలోని సభ్యులంతా సక్రమంగా పనిచేస్తేనే ఆ బృందానికి గుర్తింపు, మంచి అవకాశాలు లభిస్తాయి. సమర్థులైన బృంద సభ్యులు సంస్థకు వెన్నెముకలాంటివారు. గ్రేట్ టీమ్ మెంబర్స్ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే వారి అడుగుజాడల్లో నడవొచ్చు. గొప్ప టీమ్ మెంబర్‌గా పేరు తెచ్చుకోవాలంటే బృందంలో చురుగ్గా వ్యవహరించాలి. ఇచ్చిన పనికంటే ఎక్కువ చేసి చూపించాలి. ఎవరికోసమో ఎదురు చూడకుండా పనిని ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలి. తద్వారా కెరీర్‌లో వేగంగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. సాధారణంగా ఐదు లక్షణాలు ఒక టీమ్ మెంబర్‌ను ఉత్తముడిగా తీర్చిదిద్దుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
 
ఎల్లప్పుడూ నమ్మకస్థుడిగా ఉండడం


సంస్థ యాజమాన్యానికి ఎల్లప్పుడూ నమ్మకస్థుడిగా మెలగడం మంచి లక్షణం. నమ్మకస్థులు తమకు అప్పగించిన పనులను చిత్తశుద్ధితో పూర్తిచేస్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. పనితీరులో నాణ్యత లోపం లేకుండా జాగ్రత్తపడతారు. బృందం లోని ఇతర సభ్యులతో సానుకూలమైన సంబంధాలను కలిగి ఉంటారు. వారిని సరైన దిశలో నడిపించేందుకు ప్రయత్నిస్తారు.
 
నిజాయతీ చూపుతారు

మంచి బృంద సభ్యులు ఎప్పుడైనా నిజాయతీగా ప్రవర్తిస్తారు. తమ పని తాము నిశ్శబ్దంగా చేసుకుపోతారు. తమ గురించి ఉన్నవి లేవని గొప్పలు చెప్పుకొనేందుకు ఏమాత్రం ఇష్టపడరు. తమ అభిప్రాయాలను నిష్కర్షగా వ్యక్తం చేస్తారు. టీమ్‌లోని ఇతరుల అభిప్రాయాలను, వాదనలను గౌరవిస్తారు. వీరి కమ్యూనికేషన్ విధానం వాస్తవికంగా, నిర్మాణాత్మ కంగా ఉంటుంది.
 
ఆశించిన దానికంటే ఎక్కువే చేస్తారు


వీరు పనిలో ఎంత రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడతారు. అప్పగించిన పనిని డెడ్‌లైన్‌లోగా పూర్తిచేయాలని ఆరాటపడతారు. అవసరమైతే తమ కంఫర్ట్‌జోన్ నుంచి బయటికొస్తారు. సృజనాత్మక ఆలోచనలను కలిగి ఉంటారు. అదనపు బాధ్యతలను భుజాలపై మోసేందుకు సై అంటారు. కార్యాచరణ ప్రారంభించే విషయంలో ఇతరులకంటే ముందు వరుసలోనే ఉంటారు. సంస్థ యాజమాన్యం ఆశించిన దానికంటే ఎక్కువ పని చేసి చూపుతారు.
 
మార్పును స్వాగతిస్తారు


తమ చుట్టూ జరుగుతున్న మార్పులను చూస్తూ కూర్చోవడం తెలివైన వ్యక్తుల లక్షణం కాదు. గ్రేట్ టీమ్ మెంబర్స్ ఎల్లప్పుడూ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకుంటారు. ప్రతిదాంట్లో సానుకూలమైన మార్పునే చూస్తారు. వాటిని తమ జీవితాలకు అన్వయించుకుంటారు. ఒత్తిళ్లకు గురికావడం వారికి చేతకాదు. కాలానికనుగుణంగా నడుచుకోవడం వీరిలోనే చూస్తాం.
 
అంకితభావం ప్రదర్శిస్తారు

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పనిచేసి నెల కాగానే వేతనం జేబులో వేసుకోవడం ఎవరైనా చేసేదే. కానీ గొప్ప బృంద సభ్యులు దీనికి మాత్రమే పరిమితం కారు. వారు తమ బృందం పట్ల, పనిపట్ల అంకితభావం చూపుతారు. అందరితో కలిసి పనిచేసి, సానుకూల ఫలితాలను సాధించాలని భావిస్తారు. టీమ్‌లో ఇతరులు 100 శాతం పనిచేస్తే.. వీరు 110 శాతం పనిచేస్తారు. తమ సహచరులు కూడా ఇలాగే పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలని వీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement