నేటి నుంచి హజ్ యాత్ర | Hajj trip from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి హజ్ యాత్ర

Published Sun, Aug 21 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

Hajj trip from today

- జెండా ఊపి ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
- 22న హజ్‌హౌస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్
- 28న చివరి విమానం
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర మక్కా హజ్ యాత్ర ఆదివారం ప్రారంభం కానుంది. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఉదయం పది గంటలకు హైదరాబాద్ హజ్ హౌస్ నుంచి తొలి బృందానికి జెండా ఊపి యాత్ర ప్రారంభించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ నుంచి ఎయిరిండియా తొలి ఫ్లైట్ సౌదీ అరేబియాలోని జెద్దాకు బయలు దేరనుంది. సీఎం కేసీఆర్ ఈ నెల 22న హజ్ హౌస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని హజ్ యాత్రికుల మూడో బృందాన్ని సాగనంపనున్నారు. హజ్ యాత్రికుల కోసం ఎయిర్ ఇండియా 15 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది.

తెలంగాణ, ఏపీ యాత్రికుల కోసం ప్రతి రోజు రెండు విమానాల చొప్పున ఈ నెల 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. తొలి ఎనిమిది విమానాల్లో తెలంగాణ, తర్వాతి నాలుగు విమానాల్లో ఆంధ్రప్రదేశ్ యాత్రికులు బయలు దేరుతారు. మరో రెండు విమానాల్లో రాష్ట్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాత్రికులు, చివరి విమానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వెయిటింగ్ జాబితా యాత్రికులు బయలుదేరుతారు. ఒక్కో విమానంలో 340 యాత్రికులు వెళ్లనున్నారు. హజ్ ప్రార్థనల అనంతరం అక్టోబర్ 4 నుంచి 11 వరకు మదీనా నుంచి బయలు దే రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.   

 రాష్ట్రం నుంచి 2,800 మంది..
 తెలంగాణ నుంచి హజ్ యాత్రకు దాదాపు 2,800 మంది యాత్రికులు బయలు దేరనున్నారు. మక్కాలోని నిజాం రుబాత్‌లో సుమారు 678 మందికి ఉచిత భోజన, వసతి సౌకర్యం లభించనుంది. యాత్రికులకు సేవలందించేందుకు ప్రతి 200 మంది కి ఓ ఖాదీముల్ హుజ్జాజ్(ప్రభుత్వ వలంటీర్)లను ఎంపిక చేశారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో హజ్ క్యాంప్ రెండ్రోజుల ముందే ప్రారంభమైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement