నాగం ఓ శిఖండి! | Haris Rao fires on nagam janardan reddy | Sakshi
Sakshi News home page

నాగం ఓ శిఖండి!

Published Sat, May 27 2017 1:06 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

నాగం ఓ శిఖండి! - Sakshi

నాగం ఓ శిఖండి!

► ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు
► మంత్రి హరీశ్‌ ఆగ్రహం
► బీసీ వర్గాలను ఆయన అవమానపరిచారు
►తెలంగాణ ద్రోహులతో కాంగ్రెస్‌ జతకడితే మాకే మంచిది


సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు ప్రాజెక్టుల పాలిట నాగం జనార్దన్‌రెడ్డి శిఖండిలా మారారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి  మండిపడ్డారు. బీజేపీ నాయకుడినని చెప్పుకుంటున్న ఆయనకు వలస వెళ్లిన పాలమూరు వాసులు వాపస్‌ రావడంతో ఆక్రోశం పెరిగిందని, పాలమూరు ప్రజల ఉసురు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మండలిలో చీఫ్‌ విప్‌ సుధాకర్‌ రెడ్డి, విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నాగం మరో సారి అక్కసు వెళ్లగక్కారని అన్నారు.

ఈ ప్రాజెక్టుపై నాగం వేసిన కేసును విచారించిన హైకోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి రాలేదన్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఓడిపోయారన్న ఉక్రోషంతో నాగం, మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. హైకోర్టు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసులు వేస్తూ కాళ్లల్లో కట్టెలు పెడుతున్నాడన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో రేయింబవళ్లు పనిచేస్తోం దని, తక్కువ కాలంలోనే నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, మరో మూడు లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పా రు. ప్రజలు సంతోషపడుతుంటే, నాగంకి బాధ కలుగుతోందన్నారు.

అసలు నాగంది ఏ పార్టీ.., ఎక్కడున్నారు, బీజేపీలో ఆయన స్థానం ఏంటని ప్రశ్నించారు. గొర్రెల పంపిణీ మొదలు కాకముందే ఆయనకు అవినీతి కనిపిస్తోందని, ఒక్క గొర్రెపిల్లను కూడా కొనక ముందే అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. కులవృత్తులను పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుంటే పందులు, కుక్కలు, నక్కలు అంటూ బడుగు బలహీన వర్గాలను నాగం ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. నాగం మాటలు వ్యక్తిగతమా, లేక బీజేపీ విధానమా అన్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీలను అవమానపరిచినందుకు నాగం క్షమాపణలు చెప్పాలని అన్నారు.

టీడీపీ .. తెలంగాణ ద్రోహుల పార్టీ
కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ప్రకటనపై హరీశ్‌రావు స్పందిస్తూ.. ‘ఒక వేళ పొత్తు పెట్టుకుంటే అది ఆత్మహత్యా సదృశ్యమే. ఇదే జరిగితే మా నెత్తిన పాలు పోసినట్లే. టీడీపీ అంటేనే ద్రోహుల పార్టీ. చివరి నిమిషం వరకు రాష్ట్ర విభజన జరగకుండా పోరాటం చేశానని చంద్రబాబు గుంటూరులో చెప్పుకున్నడు.

విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు ఎన్ని అవాంతరాలు సృష్టించారో ప్రజలకు తెలియదా? పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలను బలవంతంగా ఏపీలో కలిపేసుకుంది ఎవరు? తెలంగాణ విద్యుత్‌ కష్టాల్లో ఉంటే కనికరం లేకుండా దిగవ సీలేరు విద్యుత్‌ కేంద్రాన్ని కొట్టేసింది చంద్రబాబు కాదా? విభజన చట్టం ప్రకారం రావాల్సిన విద్యుత్‌ రాకుండా తొండి చేయలేదా? అలాంటి తెలంగాణ ద్రోహుల పార్టీతో జతకడితే వారు కూడా తెలంగాణ ద్రోహులు అయిపోతరు..’అని హరీశ్‌ రావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement