T. Haris Rao
-
సబ్‌స్టేషన్ నిర్మాణాల వేగం పెంచండి
ట్రాన్స్‌కో, జెన్కో అధికారులకు హరీశ్ రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్స్టేషన్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ కన్నా ముందే పూర్తి చేసేందుకు విద్యుత్ సంస్థల సహకారం, తోడ్పాటు అవసరమన్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పరిధిలోని సబ్స్టేషన్లు, విద్యుత్ టవర్లు, హెచ్‌టీ విద్యుత్ లైన్ల నిర్మాణానికి సంబంధించి తొలిసారి మంత్రి హరీశ్‌రావు ట్రాన్స్ కో, జెన్ కో, నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విద్యుత్ సంబంధిత పనులను ప్యాకేజీల వారీగా సమీక్షించారు. 2018 మార్చి లోగా 10 సబ్ స్టేషన్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి మంగళవారం ఆయా పనుల పురోగతిపై సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఈ సమీక్షకు ఈఎన్సీ మురళీధర్, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, జెన్కో డైరెక్టర్ వెంకటరాజం, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, ఓఎస్డీ దేశ్‌పాండేలు పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ
► అందుకు అందరం భాగస్వాములవుదాం: హరీశ్ ► దేవీప్రసాద్‌కు ఘన సత్కారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం కోసం పోరాడిన స్ఫూర్తితో ఉద్యోగులందరం కలసి సీఎం కేసీఆర్ ఆశించిన బంగారు తెలంగాణను సాధిం చుకుందామని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కలసికట్టుగా కృషిచేసి, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిచేసుకుందామన్నారు. తెలంగాణ నాన్గెజిటె డ్ అధికారుల కేంద్ర సంఘం (టీఎన్జీఓ) గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో ఆయన్ను సన్మానించారు. పదవి పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదని, ఉద్యమంలో దేవీ ప్రసాద్ పోరాటానికి మించిన పదవి ఏదీ ఉండదని హరీశ్ అన్నారు. ఉద్యమ కాలంలో స్వామి గౌడ్, దేవీప్రసాద్, శ్రీని వాస్‌గౌడ్, విఠల్ చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. ఉద్యమంలో ముందున్న అన్ని వర్గాలు, విభాగాల వారిని సీఎం కేసీఆర్ దశలవారీగా సముచిత స్థానం కల్పించి గౌరవించుకొంటున్నారని చెప్పారు. టీఎన్జీవోస్ని ఏకతాటిపైన నడిపిన ఘనత దేవీప్రసాద్దే అని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి న్నారు. మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి, ఎంపీ పల్లా రాజేశ్వర్, ఎమ్మెల్యేలు శ్రీని వాస్ గౌడ్, బాబూమోహన్, ఎమ్మెల్సీలు పురా ణం సతీష్, గంగాధర్, సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎన్జీవోస్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, టీఎస్పీఎస్ సభ్యుడు విఠల్ పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ముందుకు సాగుదాం 30 ఏళ్లు ఉద్యోగుల కోసం కృషి చేశానని, ఎన్ని పదవులు నిర్వహించినా తెలంగాణ ఉద్యమాల సమయంలో వచ్చిన పేరే గొప్పగా భావిస్తానని దేవీప్రసాద్ చెప్పారు. ఉద్యోగులంతా ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధిలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు దేవీప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. -
నాగం ఓ శిఖండి!
► ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు ► మంత్రి హరీశ్ ఆగ్రహం ► బీసీ వర్గాలను ఆయన అవమానపరిచారు ►తెలంగాణ ద్రోహులతో కాంగ్రెస్ జతకడితే మాకే మంచిది సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుల పాలిట నాగం జనార్దన్‌రెడ్డి శిఖండిలా మారారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మండిపడ్డారు. బీజేపీ నాయకుడినని చెప్పుకుంటున్న ఆయనకు వలస వెళ్లిన పాలమూరు వాసులు వాపస్ రావడంతో ఆక్రోశం పెరిగిందని, పాలమూరు ప్రజల ఉసురు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మండలిలో చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నాగం మరో సారి అక్కసు వెళ్లగక్కారని అన్నారు. ఈ ప్రాజెక్టుపై నాగం వేసిన కేసును విచారించిన హైకోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి రాలేదన్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఓడిపోయారన్న ఉక్రోషంతో నాగం, మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేస్తూ కాళ్లల్లో కట్టెలు పెడుతున్నాడన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో రేయింబవళ్లు పనిచేస్తోం దని, తక్కువ కాలంలోనే నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, మరో మూడు లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పా రు. ప్రజలు సంతోషపడుతుంటే, నాగంకి బాధ కలుగుతోందన్నారు. అసలు నాగంది ఏ పార్టీ.., ఎక్కడున్నారు, బీజేపీలో ఆయన స్థానం ఏంటని ప్రశ్నించారు. గొర్రెల పంపిణీ మొదలు కాకముందే ఆయనకు అవినీతి కనిపిస్తోందని, ఒక్క గొర్రెపిల్లను కూడా కొనక ముందే అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. కులవృత్తులను పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే పందులు, కుక్కలు, నక్కలు అంటూ బడుగు బలహీన వర్గాలను నాగం ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. నాగం మాటలు వ్యక్తిగతమా, లేక బీజేపీ విధానమా అన్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలను అవమానపరిచినందుకు నాగం క్షమాపణలు చెప్పాలని అన్నారు. టీడీపీ .. తెలంగాణ ద్రోహుల పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ప్రకటనపై హరీశ్‌రావు స్పందిస్తూ.. ‘ఒక వేళ పొత్తు పెట్టుకుంటే అది ఆత్మహత్యా సదృశ్యమే. ఇదే జరిగితే మా నెత్తిన పాలు పోసినట్లే. టీడీపీ అంటేనే ద్రోహుల పార్టీ. చివరి నిమిషం వరకు రాష్ట్ర విభజన జరగకుండా పోరాటం చేశానని చంద్రబాబు గుంటూరులో చెప్పుకున్నడు. విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు ఎన్ని అవాంతరాలు సృష్టించారో ప్రజలకు తెలియదా? పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలను బలవంతంగా ఏపీలో కలిపేసుకుంది ఎవరు? తెలంగాణ విద్యుత్ కష్టాల్లో ఉంటే కనికరం లేకుండా దిగవ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని కొట్టేసింది చంద్రబాబు కాదా? విభజన చట్టం ప్రకారం రావాల్సిన విద్యుత్ రాకుండా తొండి చేయలేదా? అలాంటి తెలంగాణ ద్రోహుల పార్టీతో జతకడితే వారు కూడా తెలంగాణ ద్రోహులు అయిపోతరు..’అని హరీశ్ రావు పేర్కొన్నారు.