సబ్‌స్టేషన్ నిర్మాణాల వేగం పెంచండి
ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులకు హరీశ్ రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్‌స్టేషన్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ కన్నా ముందే పూర్తి చేసేందుకు విద్యుత్ సంస్థల సహకారం, తోడ్పాటు అవసరమన్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పరిధిలోని సబ్‌స్టేషన్లు, విద్యుత్ టవర్లు, హెచ్‌టీ విద్యుత్ లైన్ల నిర్మాణానికి సంబంధించి తొలిసారి మంత్రి హరీశ్‌రావు ట్రాన్స్ కో, జెన్ కో, నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విద్యుత్ సంబంధిత పనులను ప్యాకేజీల వారీగా సమీక్షించారు. 2018 మార్చి లోగా 10 సబ్ స్టేషన్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి మంగళవారం ఆయా పనుల పురోగతిపై సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఈ సమీక్షకు ఈఎన్‌సీ మురళీధర్, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, జెన్‌కో డైరెక్టర్ వెంకటరాజం, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, ఓఎస్‌డీ దేశ్‌పాండేలు పాల్గొన్నారు.