
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని భారీ సామర్థ్యం గల పంపుల ద్వారా నీటిని తోడుతుండటం, కొన్ని రోజులుగా వర్షాలు లేక పొలాలకు బోరుబావుల ద్వారా నీటిని తోడేందుకు విద్యుత్‌ను వినియోగిస్తుండడడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. గత 3 రోజులుగా వరుసగా విద్యుత్ డిమాండ్ రికార్డులపై రికార్డులు సృష్టించింది.
2018 సెప్టెంబర్ 11న నమోదైన 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఇప్పటివరకు రికార్డు కాగా, ఈ నెల 28న 11,064 మెగావాట్ల గరిష్ట వినియోగం నమోదై కొత్త రికార్డు సృష్టించింది. మరుసటి రోజు 29న డిమాండ్ 11,638 మెగావాట్లకు చేరి అంతకు ముందురోజు ఉన్న రికార్డును చెరిపేసింది. తాజాగా శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో విద్యుత్ డిమాండ్ 11,669 మెగావాట్లకు చేరి మరో కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకిదే అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా, రానున్న 2 నెలల్లో డిమాండ్ పెరిగి 12,000 మెగావాట్లు దాటే అవకాశముందని ట్రాన్స్‌కో అంచనా వేసింది.