సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా భారీగా పెరగనుంది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల నీటిని తరలించి వచ్చే ఖరీఫ్‌లో కనీసం 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు తొలిసారిగా సాగునీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యం మేరకు పనులు సమయానికి పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు గోదావరి జలాలను ఎత్తిపోయడానికి పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న చిన్నాచితక ఎత్తిపోతల పథకాలకు 1,080 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ సంస్థ (డిస్కం)లు సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అదనంగా 600–2,600 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది.
ఈ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు ప్రారంభం కానున్న నేపథ్యం లో వచ్చే జూలై నుంచి రాష్ట్ర విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతూ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చే సరికి రికార్డు స్థాయిలో 14,500 మెగావాట్లకు ఎగబాకనుందని రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) అంచనా వేసింది. మార్చి 4న ఏర్పడిన 10,501 మెగావాట్ల విద్యుత్ డిమాండే ఇప్పటివరకు రాష్ట్ర అత్యధిక విద్యుత్ డిమాండ్‌కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బకు వచ్చే జూలైలో ఈ రికార్డు కనుమరుగు కానుంది. జూలైలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 12,000 మెగావాట్లకు చేరనుంది. బోరు బావుల కింద పంటల సాగు లేకపోవడంతో ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు సగటున 8,200 మెగావాట్లకు తగ్గిపోయింది. జూలై నుంచి బోరు బావుల కింద ఉన్న ఆయకట్టుతోపాటు కాళేశ్వరం కొత్త ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యం లో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ అమాంతం పెరగనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేయండి..
వచ్చే జూలై నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీటి సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నీటిపారుదలశాఖ విజ్ఞప్తి చేసింది. భక్త రామదాసు, దేవాదుల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎల్లంపల్లి తదితర ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే విద్యుత్ సంస్థలు గరిష్టంగా 1,080 మెగావాట్ల వరకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపో తల కోసం అదనంగా 600–2,600 మెగా వాట్ల విద్యుత్‌సరఫరా చేయాలని నీటిపారుదలశాఖ కోరింది. ఈ ప్రాజెక్టుకు ఏ నెలలో ఎంత విద్యుత్ అవసరమన్న లెక్కలను అందించింది. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే జూలై నుంచి అదనంగా 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు టెండర్ల ను పిలిచామన్నారు. నిర్మాణంలో ఉన్న 1,080 మెగావాట్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రం నుంచి డిసెంబర్ నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభం కానుందన్నారు.
డిస్కంలపై తీవ్ర ఆర్థిక భారం!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం డిస్కంలు ముందస్తుగా భారీ ఎత్తున విద్యుత్‌ను సమీకరించి పెట్టుకుంటున్నాయి. ఇందుకోసం రూ. వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా లేక ఈ ప్రాజెక్టు కోసం సమీకరించిన విద్యుత్‌ను పూర్తిగా వాడుకోవడంలో విఫలమైనా డిస్కంలు భారీగా నష్టపోనున్నాయి. డిస్కంలు మరింత సంక్షోభంలో కూరుకుపోనున్నాయి. థర్మల్, సోలార్, జల విద్యుత్ ప్లాంట్లు కలిపి రాష్ట్రం ఇప్పటికే దాదాపుగా 16,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే 9,000 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మినహాయిస్తే జల, సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి ఎప్పడు అవసరముంటే అప్పుడు విద్యుదుత్పత్తి చేసుకొని వాడుకోవడానికి అవకాశం లేదు. రాష్ట్రంలో 3,700 మెగావాట్ల సామర్థ్యంగల సౌర విద్యుత్ కేవలం పగటి వేళల్లోనే ఉత్పత్తి అవుతుంది. 2,441 మెగావాట్ల సామర్థ్యంగల జల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నా ఆయా జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలున్నప్పుడే జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాలను తీర్చడానికి వచ్చే జూలై నుంచి మరో 1,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేయనున్నాయి.
విద్యుత్ డిమాండ్ 14,500 మెగావాట్లు!
Published Sun, Apr 28 2019 2:12 AM | Last Updated on Sun, Apr 28 2019 2:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment