
కాళేశ్వరం/మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తోడు గోదావరి, ప్రాణహిత నదులు ఉ«ధృతంగా ప్రవహిస్తుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి తెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, మేడిగడ్డ పంప్‌హౌస్, గ్రావిటీ కాల్వ పనులు పూర్తిగా స్తంభించాయి. మూడు రోజుల క్రితం మంత్రి హరీశ్‌రావు ఇక్కడ పర్యటించి ఆగస్టు చివరికల్లా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లను ఆదేశించారు. ఇంతలోనే వర్షాలు భారీగా కురుస్తుండటంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయి అధికారులు హైరానా పడుతున్నారు.
తుపాకులగూడెం ప్రాజెక్టు వద్ద..
ఏటూరునాగారం: భారీ వర్షాలతో కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంవద్ద గోదావరి ఒడ్డు వెంట నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. వరద ఉధృతి వల్ల 8 పిల్లర్లు నీటమునిగాయి.
ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
గోదావరిఖని: భారీ వర్షాలతో సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా 67 టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆర్జీ–1,2,3 ఏరియాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment