సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో బదిలీల పర్వం మొదలైంది. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ఎండీ బీ శ్రీధర్ శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటితో ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మాజనార్థనరెడ్డి, హెచ్ హరనాథరావు కూడా వేర్వేరుగా బదిలీ మార్గదర్శకాలు వెల్లడించారు. వీటి ప్రకారం నేటి (4వ తేదీ) నుంచి బదిలీ ప్రక్రియ మొదలుకానుంది. బదిలీలకు అర్హులైన వారి పేర్ల జాబితాను సంబంధిత కార్యాలయాల్లో శనివారం ప్రదర్శిస్తారు. దీంతో మొత్తం ఎంతమందికి బదిలీలు జరుగుతాయనేది స్పష్టంకానుంది. అందులో ఉన్నవారు డిస్కంల ఉద్యోగులైతే ఈ నెల 9లోగా.. జెన్‌కో, ట్రాన్స్‌కో ఉద్యోగులైతే ఈ నెల 10లోగా తమ అభ్యర్థనలను సమర్పించాలి. డిస్కంలలో బదిలీలు ఈ నెల 15కల్లా పూర్తికానుండగా, 16కల్లా జెన్‌కో, ట్రాన్స్‌కోలో చేస్తారు. అయితే, ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఈ నెల 23 వరకు గడువిచ్చారు.
ట్రాన్స్‌కో, జెన్‌కోలో మార్గదర్శకాలిలా..
- ప్రస్తుత పోస్టులో ఏప్రిల్ 30 నాటికి మూడేళ్ల పనికాలం పూర్తిచేసుకున్న వారు బదిలీకి అర్హులు. అయితే.. ఇదే తేదీకి విద్యుదుత్పత్తి కేంద్రం, కార్పొరేట్ కార్యాలయంలో ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేస్తారు.
- ఇందులోని మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందికి మాత్రమే సీనియారిటీ ప్రకారం బదిలీ జరుగుతుంది.
- రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలపై సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి బదిలీ కోరుకోవచ్చు లేదా నిలుపుకోవచ్చు.
- పరస్పర బదిలీ కావాలనుకునే వారు కనీసం ఏడాది పాటు ఒకేచోట పనిచేసి ఉండాలి.
- రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు ‘రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్’ సౌకర్యాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటే మళ్లీ ఎనిమిదేళ్లకే అర్హులవుతారు.
- ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో ఉన్నవారు బదిలీలకు అనర్హులు
డిస్కంలలో నిబంధనలు ఇలా..
- ప్రస్తుత ప్రాంతంలో ఐదేళ్లు, ఒకే పోస్టులో మూడేళ్లు పనిచేసిన వారు బదిలీకి అర్హులు.
- మొత్తం అర్హుల్లో 100 శాతం మందికి బదిలీ జరుగుతుంది.
- తీవ్ర అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు బదిలీల నుంచి మినహాయింపు పొందవచ్చు.
- వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రిటైరయ్యే వారిని బదిలీ చేయరు.
- రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ పొందాలంటే రెండేళ్లు, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ కోరాలంటే ఏడాదిపాటు ఒకేచోట పనిచేసి ఉండాలి.
- జనరల్ ట్రాన్స్‌ఫర్స్ పూర్తయిన తరువాత ఖాళీలను బట్టి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటారు.
ఒకే ఊర్లో సుదీర్ఘకాలం కుదరదు..
విద్యుత్ సంస్థల్లో గతంలో ఒకే ఊరిలో సెక్షన్, డివిజన్ కార్యాలయాలకు బదిలీ అయ్యేవారు. పోస్టులోకి వచ్చి ఎన్నేళ్లు అయ్యిందనే దానిని బట్టి బదిలీ జరిగేది. కానీ, ఇప్పుడలా కుదరదు. ఒక ఊరిలో ఎన్నేళ్లు ఉన్నారనే దానినే తప్ప పోస్టులోకి వచ్చింది లెక్కలోకి తీసుకోరు. దీనివల్ల ఒకే ఊరిలో పదేళ్లు, ఇరవై ఏళ్లు సర్వీసుచేసే అవకాశం ఉండదు. ఈ నిబంధన నుంచి యూనియన్ల నాయకులతో సహా ఎవరికీ మినహాయింపులేదు. డిస్కంలలో బదిలీ పరిధిలోకి వచ్చే వారిలో 20 శాతం మందిని మాత్రమే గతంలో బదిలీ చేసేవారు. కానీ, ఇప్పుడు ఎంతమందికి అర్హత ఉంటే అంతమందినీ బదిలీ చేయనున్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లోనూ, మారుమూల గ్రామాల్లోనూ మగ్గిపోతున్న వారికి ఇతర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పరస్పర ఆమోదంతో బదిలీ కోరుకోవాలంటే పట్టణం నుంచి గ్రామానికి, లేదా గ్రామం నుంచి పట్టణానికి అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment