⇒ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లలో భారీ వర్షాలు
⇒ మళ్లీ వణికిన భాగ్యనగరం.. రాత్రంతా భారీ వర్షం
⇒ చెరువులను తలపించిన రోడ్లు.. నీట మునిగిన పలు ప్రాంతాలు
⇒ గుడిసెలోకి నీళ్లు చేరడంతో వృద్ధుడి మృతి
⇒ రంగారెడ్డిలో కొట్టుకుపోయిన కారు.. ఆరుగురు గల్లంతు
⇒ మరో ఘటనలో బైక్ కొట్టుకుపోయి ఇద్దరు గల్లంతు
⇒ వికారాబాద్‌లోని కొత్తగడి వద్ద కొట్టుకుపోయిన రైల్వేట్రాక్
⇒ మెదక్ జిల్లా వెల్దుర్తిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం
⇒ మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, హైదరాబాద్
మహానగరం మళ్లీ అల్లాడింది. బుధవారం కురిసిన కుండపోతతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. అటు హయత్‌నగర్ నుంచి పటాన్‌చెరు దాకా.. ఇటు అల్వాల్ నుంచి మాదాపూర్ దాకా భారీ వర్షం కురిసింది. రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. నాలాలు పొంగిపొర్లాయి. అనేకచోట్ల నడుములోతు నీళ్లు నిలిచాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాంనగర్ నాలా పొంగడంతో నాగమయ్య కుంటలోని గుడిసెల్లోకి నీరు చేరింది. ఇక్కడ నారాయణ(60) వర్షం నీటిలో మునిగి చనిపోయాడు.
నారాయణగూడలో అత్యధికంగా 7.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. మొత్తమ్మీద నగరంలో 3 సెం.మీ. నుంచి 5 సెం.మీ వర్షం కురిసింది. రాంనగర్ నాలా ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండడంతో సాయిచరణ్‌కాలనీ, నాగమయ్యకుంట, పద్మాకాలనీ, అచ్చయ్యనగర్‌లలోని పలు ఇళ్లు జలమయమయ్యాయి. చిక్కడపల్లి అంబేద్కర్‌కాలనీలో ఓ ఇల్లు కూలింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మంత్రి కేటీఆర్, తాను, కమిషనర్ అందుబాటులో ఉంటామన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ విగ్రహాలు గురువారం ఉదయం 6 గంటలకే బయల్దేరతాయని చెప్పారు. సాయంత్రం 6 కల్లా నిమజ్జనాలు పూర్తయ్యేందుకు అన్ని మండపాల వారు సహకరించాలని కోరారు. కాగా, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తార్నాక, లాలాపేట, నాచారం తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
యాక్షన్ టీంలు 24 గంటలు అందుబాటులో ఉండాలి
యాక్షన్ టీమ్‌లు 24 గంటలపాటు విధి నిర్వహణలో ఉండాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర కాల్‌సెంటర్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. పురాతన, శిథిలావస్థ భవనాల్లో ఉంటున్నవారు వాటిని వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
జంట జలాశయాలకు నీరు
బుధవారం రాత్రి కురిసిన వర్షానికి హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలకు వరద నీరు చేరింది. గండిపేటకు 10 అంగుళాల మేర, హిమాయత్‌సాగర్‌కు 3 అంగుళాల మేర నీరు చేరింది. వానలు ఇలాగే ఉంటే గురువారం ఉదయానికి గండిపేటలో రెండు అడుగులు, హిమాయత్‌సాగర్‌లో ఒక అడుగు మేర నీరు చేరుతుందని అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం
రంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది గల్లంతయ్యారు. తాండూరు-కోట్‌పల్లి రహదారి మధ్యలో వెంకటాపూర్ వాగు ఉధృతిలో ఓ ఇండికా కారు కొట్టుకుపోయింది. అందులో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. ధారూరు మండలంలోని రాళ్లచిట్టెంపల్లి వాగులో బైక్‌పై వెళ్తున్న మరో ఇద్దరు గల్లంతయ్యారు. వికారాబాద్ మండలం మైలార్‌దేవరపల్లికి చెందిన వెంకటరెడ్డి, ఆయన భార్య, ధారూరు మండలం నాగమసమందర్‌కు చెందిన మౌలాలీ, ఆయన భార్య షరీఫాలు వేర్వేరు బైకులపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకటరెడ్డి భార్య, మౌలాలీ కొట్టుకుపోయారు. ఈ రెండు ఘటనల్లో గల్లంతైన వారి ఆచూకీ అర్ధరాత్రి వరకు కూడా తెలియలేదు.
ఇక వికారాబాద్ సమీపంలోని కొత్తగడి వద్ద వరదనీటికి పట్టాలు కొట్టుకుపోవడంతో బీదర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. కొంపల్లి చెరువు కట్ట తెగి వాగు ప్రవహిస్తుండడంతో వికారాబాద్-సదాశివపేట రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జిల్లాలోని చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లారుు. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారుు. శంకర్‌పల్లి మండలం పత్తేపూర్ గ్రామం వద్ద మూసీ ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ఆయా గ్రామాలకు 2 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయారుు. కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు నీరు ఉధృతంగా ప్రవహించడంతో తెల్లవారుజాము నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించారుు. లక్నాపూర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్నిచోట్ల ఇళ్లు కూలారుు.
మెదక్, నల్లగొండలో జోరువాన..
వరుసగా మూడోరోజు కురిసిన జోరు వానతో మెదక్ జిల్లా అతలాకుతలమైంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు దాదాపు 70 శాతం మేర నిండాయి. వానలతో పంటలకు కొన్నిచోట్ల ప్రయోజనం కలగగా.. మరికొన్నిచోట్ల నష్టం వాటిల్లింది. రామాయంపేట మండలంలో 7, కౌడిపల్లి మండలంలో 8 ఇళ్లు కూలిపోయాయి. ఒక్క తూప్రాన్ మండలంలో 18 ఇళ్లు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయి అలుగుపోస్తున్నాయి. పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి.
మరో రెండు రోజులు భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. మంగళవారం వరకు బంగాళాఖాతం, కోస్తాంధ్రపై ఆవరించి ఉన్న అల్పపీడనం బుధవారం దిశ మార్చుకొని తెలంగాణపై స్థిరంగా కొనసాగుతోంది. దీంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు.
గత 24 గంటల్లో మెదక్ జిల్లా వెల్దుర్తిలో అత్యధికంగా 15 సెం.మీ., రాయికోడ్‌లో 9 సెం.మీ. మేర వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 7.38 సెం.మీ., పరిగిలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా ఖాన్పూర్‌లో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. కాగా, ఈ వర్షాలకు పత్తి, వరి, సోయాబీన్, కంది వంటి పంటలకు ప్రయోజనం ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ రాజిరెడ్డి చెప్పారు.