
బస్సు ప్రమాదం కలచివేసింది : పవన్
కృష్ణాజిల్లా బస్సు ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు.
హైదరాబాద్ : కృష్ణాజిల్లా మూలపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వంతెనపై నుంచి కల్వర్టులోకి పడటం చూస్తుంటే నోటమాట రావడం లేదని మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. దీని కోసం ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఆత్మీయుల్ని కోల్పోయిన కుటుంబాలకు తగినంత నష్టపరిహారం అందించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలైన విషయం తెలిసిందే.
సంబంధింత వార్తలు
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి!
'కల్వర్టు ఉంటే ఇంతఘోరం జరిగేది కాదు'