బోరుబావుల ప్రమాదాల నివారణకు చర్యలేవీ?
సర్కార్‌ను వివరణ కోరిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: బోరు బావుల్లో పిల్లలు పడకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బోర్లు తవ్వి పూడ్చకుండా వదిలేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, తవ్వి వదిలేసిన బోర్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం కోరింది. బోరు బావులు నిరుపయోగంగా ఉన్న వాటి వల్ల జరుగుతున్న ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది బుద్దారపు ప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది.
చేవెళ్ల దగ్గరలోని ఇక్కారెడ్డిగూడలో బోరు బావిలో పడి చిన్నారి మరణించిన ఘటనలో ఆ బోరుబావి యజమానిపై పెట్టిన కేసు విచారణ ఏ దశలో ఉందో తెలపాలని కోరింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో బాలుడు చంద్రశేఖర్ బోరు బావిలో పడిన ఘటనపై ధర్మాసనం ప్రస్తావించింది. చేవెళ్ల ఘటనలో బోరుబావి యజమానిపై పెట్టిన కేసు పురోగతి వివరాలు తెలపాలని కోరిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.