‘బోరు బావుల’పై సర్కారు మార్గదర్శకాలు
ఈ ఘటనకు బాధ్యులైన బోరు యజమానిపై కేసు నమోదు చేశామని, బోరును మూసేసినా యజమాని అనుమతి లేకుండా తిరిగి తెరిచారన్నారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారంతోపాటు పిల్లలకు ఉచిత విద్య, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 3 వేల బావులకు మూతలు బిగించామన్నారు. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధిశాఖ మంత్రి సమీక్ష నిర్వహించి సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ తాజాగా మార్గదర్శకాలను రూపొందించామని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యంపై 30న హైకోర్టు విచారణ జరపనుంది.
► ప్రతి రిగ్ యజమాని లేదా ఆపరేటర్ నెలలో భూగర్భ జలశాఖ వద్ద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండేళ్లకోసారి దాన్ని పునరుద్ధరించుకోవాలి.
► రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే జరిమానా చెల్లించాలి. జరిమానా చెల్లించాక కూడా రిజిస్టర్ చేసుకోకుంటే క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
► బోరు తవ్వేందుకు తహసీల్దార్, ఎమ్మార్వో నుంచి అనుమతులున్నాయో లేదో రిగ్ యజమాని తెలుసుకోవాలి. అనుమతులు లేకున్నా బోరు తవ్వితే రిగ్ యజమానికి రూ. లక్ష జరిమానా.
► బోర్లకు మూతవేయలేదని తెలిస్తే ఎమ్మార్వో యజమానులకు నోటీసిచ్చి మూసివేతకు ఆదేశాలివ్వాలి.
► కలెక్టర్లందరూ క్షేత్రస్థాయి సిబ్బంది సాయంతో నిరుపయోగంగా ఉన్న, ట్యూబ్ బావులపై సర్వే చేసి వివరాలన్నింటినీ ఆన్‌లైన్ డేటాబేస్‌లో ఉంచాలి.
► నిరుపయోగంగా ఉన్న, తవ్వి వదిలేసిన బోరు బావుల యజమానులకు ఏడు రోజుల్లో మూసివేతకు నోటీసులివ్వాలి. మూసేయకుంటే రూ. 50 వేల జరిమానాతోపాటు క్రిమినల్ కేసు పెట్టాలి.