రోడ్డు ప్రమాదంలో పెంపుడు కుక్క మృతి
ఆస్పత్రి పాలైన యజమాని
బంజారాహిల్స్: మానవ సంబంధాలు మటు మాయమైపోతున్న రోజుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని తెలియజెప్పే ఘటన జరిగింది. తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కుక్క... తన కళ్లెదుటే విలవిల్లాడుతూ ప్రాణం విడవడం తట్టుకోలేక ఓ యువకుడు స్పృహ తప్పిపడిపోయి ఆస్పత్రిపాలయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రహ్మత్‌నగర్‌కు చెందిన రఘువీర్ సింగ్ సోమవారం ఉదయం ఎప్పటిలాగే తన పెంపుడు కుక్కను తీసుకుని ఇంటినుంచి వాకింగ్‌కు బయలుదేరాడు. అదే సమయంలో యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో నివసించే ఏఆర్ కానిస్టేబుల్ రవీందర్ బైక్‌పై వెళ్తూ కుక్కను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణం వదిలిన దృశ్యం చూసిన ర ఘువీర్‌సింగ్ తట్టుకోలేక కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు అతడిని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, సివిల్ డ్రస్‌లో ఉన్న రవీందర్ కానిస్టేబుల్ అని తెలియక స్థానికులు అతడిపై చేయి చేసుకున్నారు. అనంతరం అతడిపై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానవత్వం బతికే ఉంది..
Published Mon, Apr 27 2015 11:52 PM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM
Advertisement