హైదరాబాద్ ఘనవిజయం
సాక్షి, అంబర్‌పేట: రాజీవ్‌గాంధీ అఖిల భారత అండర్–19 టి20 ఫెడరేషన్ కప్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. అంబర్‌పేట వాటర్ వర్క్స్ క్రికెట్ మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మలేసియా జట్టుపై 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. సాగర్ చౌరాసియా (55) అర్ధసెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లలో సంజయ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 143 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన మలేసియా జట్టు 13.1 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో అజయ్‌దేవ్ గౌడ్ (4/18), నితిన్ గోపాల్ (2/6) విజృంభించారు. అంతకుముందు జరిగిన టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావు (వీహెచ్), మాజీ ఎంపీ వివేక్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి...
నేటి యువత క్రీడలపై ఆసక్తి చూపడం శుభపరిణామమని... అంతర్జాతీయ స్థాయిలోనూ వీరందరూ తమ సత్తా చూపాలని రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. క్రికెట్ నేడు ఉన్నత వర్గాలకు చెందిన క్రీడాకారుల ఆటగానే భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తా ఉన్న ప్రతి క్రికెటర్‌ను ప్రోత్సహించేందుకు గత నాలుగేళ్లుగా రాజీవ్‌గాందీ క్రికెట్ ఫెడరేషన్ అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వీహెచ్.. మాట్లాడుతూ... క్రీడాకారులను ప్రోత్సహించి వారు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు.