119 స్థానాలను 153కు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ప్రస్తుతమున్న 119 సీట్లను 153కు పెంచాలని కోరింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజలందరికీ సామాజిక న్యాయం అందించడంతో పాటు ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి సీట్లను పెంచాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలని... ఈ అంశాన్ని వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని అందులో విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 26వ సెక్షన్‌ను ప్రత్యేకంగా ఉటంకించారు. ‘రాజ్యాంగంలోని 170వ ఆర్టికల్ ప్రకారం ఎలాంటి పక్షపాతం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు జరుగుతుంది. ఏపీలోని 175 సీట్లు 221కు, తెలంగాణలోని 119 సీట్లు 153కు పెరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిర్వర్తిస్తుంది..’ అని చట్టంలో ఉన్న అంశాలను లేఖలో ప్రస్తావించారు. ‘రాజ్యాంగంలోని 170వ ఆర్టికల్ మూడో నిబంధన ప్రకారం ప్రతి జనగణన పూర్తయిన తర్వాత ప్రతి రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లను, రాష్ట్రంలోని ప్రాదేశిక నియోజకవర్గాలను పార్లమెంట్‌లో చట్టం చేయటం ద్వారా పునర్విభజించే వీలుంది..’ అని ప్రస్తావించారు.