అంతా పథకం ప్రకారమే... | it is perfect sketch done by junior artist | Sakshi
Sakshi News home page

అంతా పథకం ప్రకారమే...

Published Sat, Mar 15 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

అంతా పథకం ప్రకారమే...

అంతా పథకం ప్రకారమే...

అందరి డబ్బు కూడబెట్టుకుని పారిపోయిన చిట్టీల రాణి
  మూడు నెలల క్రితమే గుడివాడలోని ఇల్లు విక్రయం
  గుడివాడలో కూడా బాధితులు
  విజయతో పాటు చెల్లెలు, కుమారుడిపై కేసు నమోదు
 
 సాక్షి, సిటీబ్యూరో:
 టీవీ ఆరిస్టు బత్తుల విజయరాణి పథకం ప్రకారమే పారిపోయినట్టు తెలుస్తోంది. చిట్టీలు, వడ్డీ పేరుతో తోటి ఆర్టిస్టుల నుంచి సుమారు రూ.10 కోట్లు వసూలు చేసిన విజయపై సీసీఎస్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు చెల్లెలు సుధాలత, కుమారుడు చరణ్‌తో పాటు మరికొందరిపై కుట్ర, చీటింగ్ కేసులు పెట్టారు. సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు ఈ కేసును ఏసీపీ విజయకుమార్‌కు అప్పగించారు. ఇప్పటికే ఒక ప్రత్యేక పోలీసు బృందం ఆమె స్వస్థలం  గుడివాడకు వెళ్లింది. అక్కడ కూడా ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే గుడివాడలో ఉన్న సొంతింటిని కూడా ఆమె మూడు నెలల క్రితమే రూ.10 లక్షలకు విక్రయించినట్టు స్థానికులు తెలిపారు. అక్కడ కూడా విజయ బాధితులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. విజయరాణి బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కుత్బుల్లాపూర్‌లోనే ఉన్నట్టు సాంకేతిక ఆధారాల మేరకు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. చివరిసారిగా ఆమె కృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసింది. అయితే, అతను ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడ్ని ప్రశ్నిస్తే చివరిసారిగా ఆమె ఏం మాట్లాడిందో తెలిసే అవకాశం ఉంది. మరోపక్క విజయ బాధితుల సంఖ్య 120కి చేరింది. వీరిలో వడ్డీల కోసం అప్పు ఇచ్చివారు, చిట్టీలు వేసిన వారి జాబితాను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆమె వద్ద చిట్టీ పాడుకున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు.
 
 పథకం ప్రకారమే...
 కోట్ల రూపాయలు వసూలు చేసి పారిపోవాలని విజయరాణి రెండేళ్ల క్రితమే పథకం వేసినట్టు తెలుస్తోంది. ఒక్కో చిట్టీలో 20 మంది సభ్యులను చేర్పించుకున్న ఆమె.. సభ్యుల వివరాలను ఒకరికి  ఒకరికి తెలియకుండా జాగ్రత్త పడటమే ఇందుకు నిదర్శనం.  అలాగే ప్రతి సభ్యుడు, సభ్యురాలికి కూడా చివరి చిట్టీ ఇస్తానని, పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మించి ఇన్ని నెలలూ చిట్టీ డబ్బులు కట్టించుకుంది. అలాగే మరికొంత మంది వద్ద లక్షల రూపాయలను వడ్డీకి తీసుకుంది.  మరోపక్క గుడివాడలోని ఇంటిని రూ.10 లక్షలకు విక్రయించింది. విజయరాణితో పాటు చెల్లెలు సుధాలత, కుమారుడు చరణ్, కోడలు, కోడలు తల్లి కలిసి పథకం ప్రకారమే పారిపోయారని బాధితులంటున్నారు. అయితే నిజంగా ఆమె వద్ద వీరందరి డబ్బు ఉందా..? లేక వడ్డీలు కట్టలేక నష్టపోయి పారిపోయిందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సొంత కారు కూడా లేని ఆమెను నమ్మి ఇంత సొమ్ము ఎలా ఇచ్చారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆమె నిర్వహిస్తున్న మూడు మెస్‌ల వద్దకు పోలీసులు వెళ్లి ఆరా తీయగా బిల్డింగ్ యజమానికి కేవలం అడ్వాన్స్ అద్దె మాత్రమే చెల్లించిందని తేలింది. ఆమె పట్టుబడితే గాని పూర్తి వివరాలు తెలియవని అధికారులంటున్నారు. ఆమెతో పాటు చెల్లెలు సుధారాణి, కుమారుడు చరణ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
 
 ఆచూకీ లభిస్తే సమాచారం ఇవ్వండి: డీసీపీ పాలరాజు
 విజయరాణి మరికొందరి నిందితుల కోసం గాలిస్తున్నామని సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు తెలిపారు. ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలిసినా సీసీఎస్ పోలీసులకుగాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement