
కరువును పట్టించుకోని సీఎం
♦ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శ...
♦ కరువుపై గవర్నర్‌కు నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని, దాని నుంచి ప్రజలను కాపాడేలా ప్రభుత్వానికి సూచనలివ్వాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు బీజేపీ బృందం వినతిపత్రం సమర్పించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్.రామచందర్‌రావు, ప్రభాకర్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు సోమవారం రాజ్‌భవనలో గవర్నర్‌ను కలిశారు. జిల్లాల్లో కరువు తీవ్రతపై బీజేపీ రూపొందించిన నివేదికను వారు గవర్నర్‌కు సమర్పించారు. కరువు తీవ్రతను, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, తాగునీటికోసం ప్రజలు, మూగజీవాలు పడుతున్న యాతనను గవర్నర్‌కు వివరించారు.
అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, కరువు తీవ్రతవల్ల పశుగ్రాసం లేక రైతులు తమ పశువులను కబేళాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు ఎండిపోవడం, బావుల్లో చుక్కనీరు లేకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. రైతులు పొట్టకూటికోసం వలస కూలీలుగా మారిపోతున్నారని చెప్పారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కరువును పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇప్పటిదాకా మంత్రులు జిల్లాల వారీగా కనీసం సమీక్షలు కూడా జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులు చుక్క నీరు లేకుండా ఎండిపోయాయని చెప్పారు.
9 జిల్లాల్లో బీజేపీ బృందాలు కరువు పరిస్థితిపై అధ్యయనం చేశాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలవడానికి సమయం అడిగామని వెల్లడించారు. ఇంకా సమయం ఇవ్వలేదని, ఇచ్చిన వెంటనే కలుస్తామని లక్ష్మణ్ చెప్పారు. కరువుపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తం కావాలని కోరారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికలు, రాజకీయాలు, ఫిరాయింపులు తప్ప ప్రజల ఇబ్బందులు, కరువు తీవ్రత, ప్రజలను ఆదుకోవడంపై కనీస చిత్తశుద్ధి లేదని లక్ష్మణ్ విమర్శించారు.