ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు | Kalesvaram water to the SRC | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు

Published Wed, Feb 15 2017 1:48 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు - Sakshi

ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు

ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ ద్వారా తరలింపు
మూడు నాలుగు లిఫ్టులతో తరలించేలా ప్రణాళిక
రూ.వెయ్యి కోట్లకు మించి ఖర్చు కాదంటున్న నిపుణులు
తుది రూపునిస్తున్న నీటి పారుదల శాఖ


సాక్షి, హైదరాబాద్‌: గోదావరి జలాల గరిష్ట వినియోగమే లక్ష్యంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కొత్త ప్రతిపాదనను నీటి పారుదల శాఖ తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి తరలించే నీటిని అక్క డ్నుంచి వరద కాల్వ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు తీసుకువెళ్లేలా కొత్త ప్రణాళికలు వేస్తోంది. ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ మధ్యలో వరద కాల్వపై మూడు నుంచి 4 లిఫ్టులు ఏర్పాటు చేసి రివర్సబుల్‌ పంపింగ్‌ చేయడం ద్వారా సుమారు 70 టీఎంసీల మేర నీటిని తరలించేలా ప్రణాళిక ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు ఖర్చు రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువే అవుతుందని నీటిపారుదల శాఖ తన ప్రాథమిక అధ్యయనంలో తేల్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రివర్సబుల్‌ పద్ధతిలో నీటి తరలింపు..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి, అక్కడ్నుంచి మల్లన్న సాగర్‌కు నీటిని తరలించేలా ఇప్పటికే ప్రణాళిక ఖరారైన సంగతి తెలిసిందే. ఇదే ప్రణాళికలో మల్లన్నసాగర్‌కు వచ్చే నీటిని గ్రావిటీ పద్ధతిన హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు, అక్క డ్నుంచి ఎస్సారెస్పీకి తరలించేలా ప్రణాళిక ఖరారైంది. అయితే ఈ మొత్తం ప్రణాళికకు భారీ స్థాయిలో ఖర్చు, విద్యుత్‌ అవసరాలు ఉండటంతో రివర్సబుల్‌ పంపింగ్‌ ద్వారా గోదావరి ప్రవాహాన్నే వినియోగించుకొని ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీకి నీటిని తరలించే మార్గాలపై అన్వేషణ మొదలైంది. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి గోదావరి ప్రవేశించాక దాని ప్రవాహపు వెడల్పు ఏకంగా 1.5 కిలోమీటర్ల మేర ఉంటోంది. సుమారు 150 కిలోమీటర్ల మేర నీటిని తరలించాలంటే గోదావరిపై కనీసం 11 బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు కట్టాల్సి ఉంటుంది. ఇందుకు గరిష్టంగా రూ.15 వేల కోట్ల  వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గం కోసం అన్వేషించగా... ఎస్సారెస్పీ నుంచి 22 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 138 కిలోమీటర్ల మేర తవ్విన వరద కాల్వ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి చేరే నీటిని మిడ్‌మానేరుకు తీసుకొచ్చే క్రమంలో వరద కాల్వలోని 102వ కిలోమీటర్‌ వద్ద కలుపుతున్నారు. ఈ కాల్వనే వినియోగించు కుని 102వ కిలోమీటర్‌ నుంచి రివర్సబుల్‌ పద్ధతిలో ఎస్సారెస్పీకి నీటిని తరలించే ప్రతిపా దనను నీటి పారుదల శాఖ తెచ్చింది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆసక్తి చూపడం తో నీటి పారుదల శాఖ అధికారులు మరింత లోతుగా అధ్యయనం మొదలుపెట్టారు.

ప్రాథమిక అధ్యయనంలో.. వరద కాల్వపై ప్రతి 25 నుంచి 35 కిలోమీటర్లకు మధ్య ఒక లిఫ్టును 10 నుంచి 15 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసి మొత్తంగా నాలుగు లిఫ్టుల ద్వారా సుమా రు 60 నుంచి 70 టీఎంసీల నీటిని తరలించ వచ్చని తేల్చారు. వరద కాల్వ పరిధిలోనే ఉన్న రెగ్యులేటర్లను వినియోగించే అవకాశం ఉన్నందున ఈ ప్రణాళికకు గరిష్టంగా రూ.వెయ్యి కోట్లకు మించి ఖర్చయ్యే అవకాశం లేదని అధికారులు తేల్చినట్లు సమాచారం. అయితే విద్యుత్‌ వినియోగం, ఎన్ని టీఎంసీల లిఫ్టులు ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. ఇది తేలితే దీనిపై సీఎం స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement