
తెలంగాణ రాష్ట్ర చేపగా కొరమీను
హైదరాబాద్: కొరమీనును రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు రాష్ట్రానికి కొరమీనును గుర్తించడం జరిగింది. కొరమీను తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా లభించడంతోపాటు ప్రజలు ఇష్టంగా తినే కొరమీనును రాష్ట్ర చేపగా గుర్తించాలని మత్స్యశాఖ రెండు నెలల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఓ ప్రకటన చేసింది. కాగా ప్రతి రాష్ర్టానికి ఆ రాష్ట్ర చేపగా ఒక రకాన్ని గుర్తిస్తారు.
అలా గుర్తించిన చేపను కాపాడుకోవటమే కాకుండా, దాని సంతతిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. అంతేకాకుండా ఆ చేప జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్‌లో భద్రపరుస్తారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్తో పాటు కేరళ ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రాల చేపలను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర చెట్టుగా జమ్మిచెట్టు, రాష్ట్ర పువ్వుగా తంగేడును ప్రకటించిన విషయం తెలిసిందే.