మహిళల్ని వ్యక్తులుగా గుర్తిస్తేనే సాధికారత సాధ్యం | Lalitha Kumar Mangalam demand on Focus conditions women | Sakshi
Sakshi News home page

మహిళల్ని వ్యక్తులుగా గుర్తిస్తేనే సాధికారత సాధ్యం

Published Thu, Nov 10 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

మహిళల్ని వ్యక్తులుగా గుర్తిస్తేనే సాధికారత సాధ్యం

మహిళల్ని వ్యక్తులుగా గుర్తిస్తేనే సాధికారత సాధ్యం

 స్త్రీలు పనిచేసే కార్యాలయాల్లో క్రెచ్ సెంటర్లు ఉండాలి
 హోం టు వర్క్‌కు మద్దతిస్తున్నా...
 మహిళా ఉద్యోగినుల నుంచే ఒత్తిడి రావాలి
 జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ లలిత కుమారమంగళం
 డిసెంబర్ నుంచి మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. కానీ అభివృద్ధిలో ఇంకా వెనుకబాటు కనిపిస్తోంది. ఈ అసమానతకు కారణం మహిళల్ని సమాజంలో వ్యక్తులుగా గుర్తించకపోవడమే. వారికి అవకాశాలతో పాటు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. క్షేత్ర స్థాయి నుంచి మహిళల స్థితిగతులపై దృష్టిసారించాలి’’ అని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్ లలిత కుమారమంగళం పేర్కొన్నారు. బుధవారం జాతీయ గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
 
  ‘మహిళల ఆలోచనా విధానం మారాలి. ప్రస్తుతం మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నచోట్ల క్రెచ్ సెంటర్లు లేవు. సరైన మౌలిక వసతులు లేకపోవడం బాధాకరం. కుటుంబ పాలన చూసుకోవడంతో పాటు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించడం కష్టమైన పని. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కార్యాలయాల్లో కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో హోం టు వర్క్ అమల్లో ఉంది.
 
 ఈ పద్ధతికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నా. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ పద్ధతి పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే, ఈ డిమాండ్ మహిళా ఉద్యోగుల నుంచి వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వచ్చే రెండేళ్ల కాలంలో గ్రామ పంచాయతీలకు రూ.2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నిధులను గ్రామాల్లో మహిళాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుంది.’ అని అన్నారు. అనంతరం ఓర్వకల్ మహిళా సమాఖ్య సలహాదారు విజయ భారతి మాట్లాడుతూ మహిళల్ని అనుబంధాలతో కట్టిపడేస్తున్నారని, దీంతో స్వేచ్ఛ కోల్పోవడంతో పాటు మానసిక వేదనలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఎన్‌ఐఆర్‌డీతో ఒప్పందం: ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న మహిళల పాత్ర పాలనలో కనిపించడం లేదని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ లలిత కుమారమంగళం అభిప్రాయపడ్డారు. వారికి అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఎన్‌ఐఆర్‌డీతో జాతీయ మహిళా కమిషన్ ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. డిసెంబర్ నుంచి శిక్షణ కార్యక్రమాలు చేపడతామని, ముందుగా రాజస్తాన్‌లో కార్యక్రమం ప్రారంభిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డీ డెరైక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి, రిజిస్ట్రార్ చంద్ర పండిట్ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement