సామాన్యులు అల్లాడుతున్నారని సభ్యుల ఆవేదన
నాదే 3 ఎకరాలు కబ్జా చేశారు: బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నాయని, రెండుసార్లు రిజి స్ట్రేషన్లు చేయడం వల్ల ఎవరి భూములేంటో తెలుసుకోలేని స్థితిలో జనం ఉన్నారని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ప్రశ్నోత్తరాలసమయం ప్రారంభంలోనే భూ కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు తదితరాలపై పలువురు సభ్యులు మాట్లాడారు.
నా భూమే మూడెకరాలు కబ్జా చేశారు..
‘నా భూమినే 3 ఎకరాలు కబ్జా చేశారు. శాసనసభ్యుడినైన నా భూమే కబ్జా చేశారంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితేంటో ఊహించుకోవచ్చు’ అని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు.
ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?
రెవెన్యూ విభాగంలో జరుగుతున్న పరిణామాలతో పలువురు సామాన్య భూమి హక్కుదారు లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, దీనిపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
22బీ సవరణ చట్టాన్ని తెస్తున్నాం
ఇప్పటికే భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తదితర వాటిపై ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ప్రవేశపెట్టామని, భూముల వివరాలన్నీ ఈ పోర్టల్ పెట్టామని రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సమాధానమిచ్చారు. త్వరలోనే రెవెన్యూ చట్టంలో 22బీకి సవరణ తీసుకొస్తామన్నారు.
పాస్‌బుక్కులు రైతుల హక్కు: వైఎస్ జగన్
పాస్‌బుక్కులు రైతుల హక్కు అని, వీటిని తొలగించి ఈ-బుక్‌లు, ఈ-పోర్టల్‌లో పెట్టామనడం మంచిది కాదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ అన్నీ కంప్యూటరైజ్డ్ అంటే రేపు ఏదైనా రెవెన్యూ విభాగం ఎవరితోనైనా కొల్యూడ్ అయినా, హ్యాకింగ్ జరిగినా మొత్తం వివరాలన్నీ పోతాయని, అప్పుడిక చేసేదేమీ ఉండదన్నారు. అదే రైతుల దగ్గర పాస్‌బుక్కులు ఉంటే మేలు భరోసా ఉంటుందని, ఆ భూమిపై పాస్‌బుక్కులనే హక్కుగా భావిస్తారని చెప్పారు. పాస్‌బుక్కులు మొదటి ఆప్షన్‌గా ఉంటే కంప్యూటర్ విధానాన్ని రెండో ఆప్షన్‌గా పెట్టుకోవాలని సూచించారు. దీనికి మంత్రి కేఈ సమాధానమిస్తూ.. పాస్‌బుక్కులు తొలగించబోమని స్పష్టం చేశారు.
యథేచ్ఛగా భూ కబ్జాలు
Published Thu, Mar 17 2016 2:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement