చివరి విడత కౌన్సెలింగ్ రద్దు
చివరి విడత కౌన్సెలింగ్ రద్దు
Published Wed, May 31 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM
- యాజమాన్య పీజీ వైద్య సీట్ల చివరి విడత కౌన్సెలింగ్ రద్దు
- నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసుకున్న ఆరోగ్య విశ్వవిద్యాలయం
- కేంద్ర ప్రభుత్వ జీవో ప్రకారమే చేశామంటున్న అధికారులు
- ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యానికి సీట్లు వదిలేసిన వైనం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మిగిలిన యాజమాన్య పీజీ వైద్య సీట్లకు చివరి విడత (మాప్ అప్ రౌండ్) కౌన్సెలింగ్ రద్దు చేస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నిర్ణయం తీసుకుంది. అందుకోసం సోమవారం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. తెలంగాణ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల సంఘం అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ స్పష్టం చేసింది. మిగిలిన సీట్లను యాజమాన్యాలే సొంతంగా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో బుధవారం జరగాల్సిన కౌన్సెలింగ్ కూడా రద్దు చేసినట్లయింది. ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ఎంసీఐ ఆదేశాలున్నా వర్సిటీ ఇలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాప్ అప్ రౌండ్ తర్వాత మిగిలే సీట్లను ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలే భర్తీ చేసుకోవచ్చని ఈ నెల 26న కేంద్రం స్పష్టం చేసిందని, ఆ ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అయితే మాప్ అప్ రౌండ్ ముగియకపోయినా కౌన్సెలింగ్ రద్దు చేయడంపై విమర్శలొస్తున్నాయి.
241 సీట్లను సొంతంగా కేటాయించుకునే వీలు
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో 241 సీట్లు మిగిలిపోయాయి. ఇటీవల 415 మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించగా 268 సీట్లే భర్తీ అయ్యాయి. 147 సీట్లు మిగిలిపోయాయి. పీజీ డెంటల్ కోర్సుల్లోని 153 సీట్లలో 59 భర్తీ కాగా 94 సీట్లు మిగిలాయి. ఆ సీట్లను ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలు అమ్ముకోవ డానికి వీలు చిక్కింది. మెడికల్ కోర్సు ల్లోని నాన్ క్లినికల్ కోర్సులకు డిమాండ్ లేదని, డెంటల్ కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపింట్లేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన మెడికల్ సీట్లల్లో 10 వరకే క్లినికల్ సీట్లుంటా యంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో 80 వరకు నాన్ క్లినికల్ సీట్లు మిగిలిపోయా యని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
Advertisement