
ఈసారి మహానాడు అమరావతిలో
తెలుగుదేశం పార్టీ మహానాడు వచ్చే నెల 27 నుంచి 29 వరకూ ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడు వచ్చే నెల 27 నుంచి 29 వరకూ ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించనున్నారు. మంగళవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ విభాగం అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, జాతీయ కార్యాలయ సమన్వయకర్త టీడీ జనార్దనరావు, కార్యక్ర మాల కమిటీ చైర్మన్ వీవీవీ చౌదరి పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 15 వేల మంది నేతలు మహానాడుకు రానున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు గుంటూరు నుంచి నిర్వహించనున్నారు.
ఈ కార్యాలయాన్ని ఈ నెల 22న గుంటూరులో ప్రారంభిస్తారు. ప్రస్తుతం గుంటూరులోని పిచ్చుకులకుంటలో జిల్లా కార్యాలయం ఉన్న ప్రాంగణంలోనే ప్రధాన కార్యాలయాన్ని మంచి రోజు చూసుకుని ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయ అవసరాల దృష్ట్యా ప్రస్తుతం హైదరాబాద్ ఎన్‌టీఆర్ భవన్‌లో ఉన్న గ్రంథాలయం, కార్యక్రమాల కమిటీ తదితరాలను మే తొలి వారంలో గుంటూరు తరలించాలని ఇప్పటికే నిర్ణయించారు. పార్టీ అధినేత బాబు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉంటూ విజయవాడ నుంచి అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, గుంటూరుల్లో 4 రోజులపాటు ముఖ్య నేతలంతా అధినేతకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు.
పన్ను వసూళ్ల లక్ష్యం 52,618 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17)లో రూ. 52,618 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పన్నేతర ఆదాయ లక్ష్యం రూ. 5,495 కోట్ల లక్ష్యాన్ని కూడా చేరుకోవాలని సూచించారు. ఆదాయ సముపార్జిత ప్రభుత్వ శాఖల పనితీరు, ఫలితాలపై సీఎం మంగళవారం విజయవాడలో సమీక్ష నిర్వహించారు.