మాజిద్ హల్‌చల్
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పాలక మండలి తొలి సమావేశంలో మాజీ మేయర్, ప్రస్తుత మెహదీపట్నం కార్పొరేటర్ మాజిద్‌హుస్సేన్ హంగామా సృష్టించారు. ప్రభుత్వం ప్రకటించిన వంద రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులన్నీ పాతవేనని... కొత్తగా చేస్తున్నవేమిటని ప్రశ్నించారు. వార్డు కమిటీలు రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయాల్సినవేనని.. 569 రహదారుల పనుల బాధ్యత జీహెచ్‌ఎంసీపై ఉందన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధి పనులు ఏడాదిన్నర క్రితం మంజూరైనవేనని చెప్పారు. 350 ఖాళీ ప్రదేశాలకు ప్రహరీలు నిర్మించేబదులు వాటిలో ఫంక్షన్ హాళ్లు, వృద్ధాశ్రమాలు, ఈ లైబ్రరీలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రశ్నను ముగించాలని... కమిషనర్ సమాధానమిస్తారని మేయర్ పదేపదే వారించినా మాజిద్ పట్టించుకోలేదు.
తన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా అందిన సమాధానం సంతృప్తికరంగా లేనందునే వీటిని ప్రస్తావిస్తున్నానన్నారు. ‘మేం చెప్పేది వినిపించుకోనప్పుడు.. కౌన్సిల్‌కు ఎందుకు రావాలి? ఇంకెవరికి చెప్పుకోవాలి?’ అని ప్రశ్నించారు. మీరు సీనియర్.. కొత్తవారికి చెప్పాలి. మీరే ఎక్కువ సమయం తీసుకోవడం బాగుంటుందా? ఇదేనా డిసిప్లిన్? అంటూ మేయర్ వారించే ప్రయత్నం చేశారు. మాజిద్ అనేకసార్లు మేయర్ పోడియం వైపు వెళ్లారు. ఆయనతో పాటు మిగతా ఎంఐఎం సభ్యులంతా మేయర్ పోడియం వద్దకు చేరడంతో టీఆర్‌ఎస్ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వాదోపవాదాలతో గందరగోళం నెలకొంది.
రూ.5 కోట్లకు పెంచాలి
కార్పొరేటర్ల బడ్జెట్‌ను రూ.5 కోట్లకు పెంచాలని.. జోనల్ కమిషనర్లకు రూ.20 లక్షల పనులకుఅధికారమివ్వాలని మాజిద్ కోరారు. తద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చున ని చెప్పారు.