
సిద్దిపేట కమాన్: కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల దళిత, గిరిజనుల రాజ్యాంగ హక్కులకు విఘాతం కలుగుతోందని.. దీని నుంచి రక్షణ కోసం, హక్కుల పరిరక్షణ కోసమే ఈ నెల 27న వరంగల్‌లో దళిత, గిరిజనుల సింహగర్జన నిర్వహిస్తున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.
మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సింహగర్జన సన్నాహక సదస్సు సభలో మంద కృష్ణ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంటరానితనాన్ని దూరం చేసి, వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేందుకే రిజర్వేషన్ విధానం రూపొందించబడిందని.. దానినే తీసేసే ప్రయత్నం నేడు జరుగుతోందని తెలిపారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 14, 17, 21 ఆర్టికల్స్‌కి వ్యతిరేకమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల అట్రాసిటీ చట్టం భయం తొలగిపోయి.. తిరిగి దళితులపై దాడులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కరికె శ్రీనివాస్, నాయకులు రమేశ్, నర్సింలు, కనకయ్య, ఖమ్మంపల్లి యాదగిరి, రోమాల బాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.