
మేయర్ విదేశీ పర్యటనలపై సీఎం ఆగ్రహం
హైదరాబాద్: హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ విదేశీ పర్యటనలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నగరంలో వైట్‌టాపింగ్ రోడ్లు, తదితర అంశాలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అధికారులు వెళ్లిపోయాక తరచూ విదేశీ పర్యటనలెందుకంటూ మేయర్‌కు సీఎం క్లాస్ తీసుకున్నారు. మన పనులు మనం చేసుకోవాలే కానీ విదేశాలకెందుకని ప్రశ్నించారు.
ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఇక విదేశీ పర్యటనలు మానుకోవాలని సూచించారు. రెండు నెలల క్రితం ఫ్రాన్స్, నాలుగు రోజుల క్రితం ఆస్ట్రేలియాకు మేయర్ వెళ్లడాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ప్రజాసమస్యలతోపాటు తరచూ కూలిపోతున్న భవనాల విషయాన్ని సీఎం ప్రస్తావించారని తెలిసింది.