
పెన్షన్ ప్రభుత్వాల భిక్షకాదు
♦ ఏఐఎస్‌జీఈఎఫ్ చైర్మన్ ముత్తు సుందరం
♦ కాంపన్సేటరీ పెన్షన్ స్కీం రద్దు కోసం 2న దేశవ్యాప్త సమ్మె
సాక్షి, హైదరాబాద్: పెన్షన్ అనేది ఉద్యోగులకు ప్రభుత్వాలు వేసే భిక్ష కాదని, అది రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎస్‌జీఈఎఫ్) చైర్మన్ ముత్తుసుందరం అన్నారు. కాంపన్సేటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు, పాత పెన్షన్ స్కీం అమలు కోసం ఉద్యోగులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలన్నారు. సీపీఎస్ రద్దు, ఐటీ పరిమితి పెంపు, ఖాళీల భర్తీ వంటి డిమాండ్లతో ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ముత్తుసుందరం ప్రసంగించారు.
ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1 తరువాత నియమితులైనవారికి పాత పెన్షన్ స్కీంను రద్దు చేసి కాంపన్సేటరీ పెన్షన్ స్కీంను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. ఉద్యోగుల సాంఘికభద్రతకు ఉద్దేశించిన పెన్షన్‌ను ప్రభుత్వాలు ఆర్థికభారం పేరుతో ఉద్యోగులకు దక్కకుండా చేస్తున్నాయని అన్నారు. టీఎన్‌జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు.
తమిళనాడు తరహాలో సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ కోసం టీఎన్‌జీవో కృషి చేస్తోందని చెప్పారు. టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు, దేశవ్యాప్త సమ్మె కోసం జిల్లాలవారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టీఎన్‌జీవో నేతలు హమీద్, రేచల్ తదితరులు మాట్లాడారు.