♦ ‘స్వగృహ’ పేర బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ ఇదీ
♦ బ్యాంకులతో వన్‌టైం సెటిల్‌మెంట్
♦ వడ్డీ సహా రూ.300 కోట్లు చెల్లించిన ప్రభుత్వం
♦ మూడేళ్లుగా ఒక్క ఇంటినీ విక్రయించని వైనం
♦ ఫలితంగా పెరిగిపోయిన అప్పులు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ అధికారుల నిర్లక్ష్యం ఖరీదు రూ.125 కోట్లు. కళ్ల ముందు నష్టం జరుగుతున్నా సరిదిద్దే నిర్ణయం తీసుకోకుండా చోద్యం చూసిన ఫలితమిది. రాజీవ్ స్వగృహ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులను సకాలంలో తీర్చలేకపోవటంతో రూ.125 కోట్ల మేర వడ్డీ పేరుకుపోయింది. ప్రజలకు తక్కువ ధరకే అన్నిరకాల వసతులున్న ఇళ్లను అందించే ఉద్దేశంతో గతంలో రాజీవ్ స్వగృహ ఉమ్మడి రాష్ట్రంలో 21 చోట్ల వెంచర్లు ప్రారంభించింది. బ్యాంకుల నుంచి దాదాపు రూ.1200 కోట్లు అప్పుగా తీసుకుంది.
బ్యాంకు రుణాలు, డిపాజిట్ల మొత్తంతో కలిపి కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగా మరికొన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగింది. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో అధికారులు మిలాఖత్ అయి దాదాపు రూ.200 కోట్లు పక్కదారి పట్టిం చారు. ఆ నిధుల లెక్క సరిచేసే క్రమంలో ఒక్కసారిగా ఇళ్ల ధరలను పెంచేశారు. మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేక పనులను ఆపేశారు. దీంతో ఆ ప్రాజెక్టు గుడ్‌విల్ దెబ్బతిన్నది. ధరల బూచితో ఇళ్ల అమ్మకం నిలిచింది. దానిపై నయాపైసా ఆదాయం రాకపోగా, బ్యాంకు అప్పులు కొండలా పేరుకుపోయాయి.
‘నమ్మకం’ సన్నగిల్లటంతో...
ప్రభుత్వ పథకాలకు బ్యాంకుల చేయూత అవసరమైన తరుణంలో... ప్రధాన బ్యాంకులన్నీ స్వగృహ బకాయిల గురించి ప్రస్తావిస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు ఇటీవల కొత్తగా గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన అశోక్‌కుమార్ బ్యాంకర్లతో చర్చించి వన్‌టైం సెటిల్‌మెంటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కొన్ని బ్యాంకులు వడ్డీ మొత్తాన్ని తగ్గించగా, మరికొన్ని బ్యాంకులు ఉన్నంత మేర వడ్డీ చెల్లిస్తే భవిష్యత్తులో అసలు చెల్లించే వరకు వడ్డీ విధించబోమని స్పష్టం చేశాయి. వాటితో కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వం తాజాగా రూ.300 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. ఇందులో రూ.125 కోట్లు వడ్డీ పోగా మిగతాది ఓ బ్యాంకుకు సంబంధించిన అసలు మొత్తం ఉంది. గతంలోనే దిద్దుబాటు చర్యలకు దిగి ఉంటే ఇప్పుడు రూ.125 కోట్లు వృథా అయ్యేవికావు.
నిర్లక్ష్యం ఖరీదు రూ.125 కోట్లు
Published Fri, Apr 15 2016 5:11 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM
Advertisement