శ్రీశైలం:
శ్రీశైలం దేవస్థాన పరిధిలోని విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో శనివారం నవ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో వధువు మృతి చెందగా.. వరుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సీఐ వెంకట చక్రవర్తి కథనం మేరకు.. విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో మహబూబ్‌నగర్ జిల్లా కొండ్రావులకు చెందిన మల్లికార్జునాచారి పేరిట బుక్ చేసిన గదిలో ఈనెల 27న యశోద(21), మణితేజ(25) అనే నవ దంపతులు దిగారు. వీరు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రామాలయంలో గత వారం పెళ్లి చేసుకుని అక్కడి నుంచి నేరుగా భద్రాచలం.. అనంతరం తిరుపతి మీదుగా శ్రీశైలానికి చేరుకున్నారు. నాలుగు రోజుల క్రితం యశోద తప్పిపోయినట్లు హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ స్టేషన్ ఎస్‌ఐ శనివారం శ్రీశైలం పోలీసుస్టేషన్‌కు ఫోన్ చేసి యశోద సెల్‌ఫోన్ ఆధారంగా ఆమె శ్రీశైలంలో ఉన్నట్లు చెప్పాడు.
ఈ క్రమంలో విశ్వబ్రాహ్మణ సత్రంలోని గదులను సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తనిఖీ చేశారు. వీరు ఉన్న రూము తలుపులు కొట్టగా కొద్దిసేపటి తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఉన్న మణితేజ తలుపు తెరిచాడు. అప్పటికే యశోద మృతి చెందింది. మణితేజను దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. బ్లేడ్‌తో చేతి నరాలు కోసుకుని వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు. మణితేజ కథనం మేరకు.. 30వ తేదీ మధ్యాహ్నం గది ఖాళీ చేయాల్సి ఉండగా..ఇరువురూ నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మణి నీరసంతో కొద్దిసేపు నిద్రపోగా, బాధను తట్టుకోలేక యశోద ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుందని వెల్లడించాడు. తేరుకున్న తాను చున్నీని బ్లేడ్‌తో కట్ చేసి యశోదను మంచంపై పడుకోబెట్టానని.. ఈలోపు తలుపులు తట్టిన శబ్దం రావడంతో బయటకు వచ్చానని మణితేజ తెలిపాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తనకు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన యశోదతో వనపర్తిలో పరిచయమైందని, తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు.
నవదంపతుల ఆత్మహత్యాయత్నం
Published Sun, May 31 2015 12:40 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
Advertisement