Attempted to commit suicide
-
పిల్లలు మాట వినడం లేదని తల్లి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం: తన కడుపున పుట్టిన పిల్లలు తాను చెప్పిన మాటలు వినడం లేదని మనస్థాపం చెందిన ఓ ఇల్లాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం కొమరాడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పార్వతీపురం ఏరియా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొమరాడ గ్రామానికి చెందిన దాసరి పైడితల్లి అనే వివాహిత తన భర్త పోలీసు, పిల్లలు చెప్పిన మాట వినడం లేదని మనస్థాపం చెంది, ఇంట్లో ఉన్న పేలు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వాంతులు అవడాన్ని గమనించిన పిల్లలు ఈ విషయాన్ని పక్కింటి వారికి చెప్పడంతో వారు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం పైడితల్లి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. -
ప్రేమ పేరుతో వంచన
నువ్వంటే ఇష్టమన్నాడు. నువ్వులేనిదే లేనన్నాడు. పెళ్లిపేరుతో లొంగదీసుకున్నాడు. చివరికి తాళి కట్టమంటే పత్తాలేకుండా పోయాడు. తట్టుకోలేని బాధితురాలు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదోని టౌన్: మండల పరిధిలోని కుప్పగల్ గ్రామానికి చెందిన గురుస్వామి, తిప్పమ్మ కుమారుడు బోయ శ్రీనివాసులు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి మాయ మాటలకు నమ్మి సర్వం అర్పించింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని శ్రీనివాసుల వద్ద ప్రస్తావించి, పెళ్లి చేసుకోవాలని కోరింది. నిరాకరించడంతో కుటుంబ సభ్యులతో కలిసి అతని ఇంటికి వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. చేసేదేమీ లేక వెనుదిరిగింది. మరోపక్క తల్లిదండ్రులు యువతిని మందలించారు. దీంతో మనస్తాపం చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయంపై పెద్దతుంబళం ఎస్ఐ రమేష్‌బాబును ఆరా తీయగా ప్రేమపేరుతో మోసం చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, విచారించి బాధితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు. -
కలకలం రేపిన మహిళ
శనివారపుపేట (ఏలూరు రూరల్) : ఏలూరు మండలం శనివారపుపేటలో శుక్రవారం ఓ మహిళ చంటిపిల్లను ఒళ్లో పెట్టుకుని కిరోసిన్¯ డబ్బా, అగ్గిపెట్టె పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంటానంటూ ఆందోళనకు దిగడం కలకలం రేపింది. గ్రామస్తులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ప్రధాన డ్రెయినేజీ అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మరడాని రమణ ఇంటి ముందు సిబ్బంది తవ్వకాలు చేపట్టారు. తమ స్థలంలో డ్రెయినేజీ నిర్మించడాన్ని నిరసించిన ఆమె డ్రెయినేజీ నిర్మాణ పనులు అడ్డుకునేందుకు మనుమరాలిని చేతపట్టుకుని పనులు ఆపకపోతే కిరోసిన్ పోసుకుని అంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బైఠాయించింది. దీంతో సిబ్బంది పనులు నిలిపేశారు. పంచాయతీ పాలకవర్గం ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మహిళా పోలీస్ అందుబాటులో లేకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకోలేక వెనుదిరిగారు. దీనిపై ఇన్చార్జి సర్పంచ్ సూరత్తు నారాయణ మాట్లాడుతూ ఆక్రమణకు గురైన డ్రైయినేజీ స్థలంలో రాళ్లు, మట్టి తొలగించామన్నారు. అయినప్పటికీ బాధిత మహిళ అడ్డుకుంటోందని తెలిపారు. డ్రైయినేజీ ఆక్రమణ వల్ల మురుగునీరు పారుదల కాకపోవడంతో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. గతంలోనే పాలకవర్గం ఆ మహిళకు వివరించినప్పటికీ వినడం లేదన్నారు. -
కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
తన సమస్య పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ రైతు అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్యకు నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. భూమి వివరాలు.. ఆన్ లైన్ చేసేందుకు చాలా కాలంగా వీఆర్వో చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగి పోయిన బ్రహ్మయ్య సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ ను కలిసేందుకు వచ్చాడు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులోకి రాకపోవడంతో.. డీఆర్వోకు ఫిర్యాదు ఇచ్చాడు. తర్వాత వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.. ఇది గమనించిన సిబ్బంది బ్రహ్మయ్యను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైతుకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. -
నవదంపతుల ఆత్మహత్యాయత్నం
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థాన పరిధిలోని విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో శనివారం నవ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో వధువు మృతి చెందగా.. వరుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సీఐ వెంకట చక్రవర్తి కథనం మేరకు.. విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో మహబూబ్‌నగర్ జిల్లా కొండ్రావులకు చెందిన మల్లికార్జునాచారి పేరిట బుక్ చేసిన గదిలో ఈనెల 27న యశోద(21), మణితేజ(25) అనే నవ దంపతులు దిగారు. వీరు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రామాలయంలో గత వారం పెళ్లి చేసుకుని అక్కడి నుంచి నేరుగా భద్రాచలం.. అనంతరం తిరుపతి మీదుగా శ్రీశైలానికి చేరుకున్నారు. నాలుగు రోజుల క్రితం యశోద తప్పిపోయినట్లు హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసుస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ స్టేషన్ ఎస్ఐ శనివారం శ్రీశైలం పోలీసుస్టేషన్‌కు ఫోన్ చేసి యశోద సెల్‌ఫోన్ ఆధారంగా ఆమె శ్రీశైలంలో ఉన్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో విశ్వబ్రాహ్మణ సత్రంలోని గదులను సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తనిఖీ చేశారు. వీరు ఉన్న రూము తలుపులు కొట్టగా కొద్దిసేపటి తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఉన్న మణితేజ తలుపు తెరిచాడు. అప్పటికే యశోద మృతి చెందింది. మణితేజను దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. బ్లేడ్‌తో చేతి నరాలు కోసుకుని వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు. మణితేజ కథనం మేరకు.. 30వ తేదీ మధ్యాహ్నం గది ఖాళీ చేయాల్సి ఉండగా..ఇరువురూ నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మణి నీరసంతో కొద్దిసేపు నిద్రపోగా, బాధను తట్టుకోలేక యశోద ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుందని వెల్లడించాడు. తేరుకున్న తాను చున్నీని బ్లేడ్‌తో కట్ చేసి యశోదను మంచంపై పడుకోబెట్టానని.. ఈలోపు తలుపులు తట్టిన శబ్దం రావడంతో బయటకు వచ్చానని మణితేజ తెలిపాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తనకు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన యశోదతో వనపర్తిలో పరిచయమైందని, తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. -
అన్నదాత ఆత్మహత్యాయత్నం
బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక... భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన రైతు అజ్మీరా శ్రీనివాస్ బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. శ్రీనివాస్ గొల్లబుద్దారం గ్రామానికి చెందిన రామన్నతో కలిసి 1998లో ట్రాక్టర్ కొనుగోలు నిమిత్తం తమ వ్యవసాయ భూమిపై భూపాలపల్లి డీసీసీబీ బ్యాంకులో రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు. రుణం తీసుకున్న నాటి నుంచి వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు ఇటీవల శ్రీనివాస్, రామన్నపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. చేసేది లేక వీరువురు ఈ నెల 10న డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం బ్యాంకు రికవరీ అధికారులు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి డబ్బులు చెల్లించాల్సిందిగా కోరారు. డబ్బులు లేవని, కొంత గడువు ఇవ్వాలని ఆయన కోరగా, అధికారులు వినకుండా ఇంటిలోని వస్తువులను జప్తు చేస్తామని బెదిరించారు. దీంతో శ్రీనివాస్ తన ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని భూపాలపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా, బ్యాంకు బాకీ డబ్బుల కోసం గ్రామానికి వెళ్లగా శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
ముప్పుతిప్పలు పెట్టి.. పోలీసులకు చిక్కి..
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు ఆస్పత్రిలో చేర్పించిన వైనం పీఎం పాలెం: విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు రవీంద్ర పోలీసులకు చిక్కాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పీఎం పాలెం సీఐ అప్పలరాజు తెలిపిన వివరాలివి. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రవీంద్ర మధురవాడ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడి ఆగడాలు శుతిమించడంతో యాజమాన్యం కళాశాల నుంచి పంపిం చేసింది. అతడు ఆ ప్రాంతంలో ఉంటూ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని ఫొటో తీసి మార్ఫింగ్ చేసి ఆమెను బెదిరించ సాగాడు. తన రూమ్‌కు ఒంటరిగా వస్తే ఫొటోలు ఇస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మి ఆమె వెళ్లగా స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి యత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భీమిలిలో ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు శక్రవారం అక్కడకు వెళ్లారు. అతడు వారి నుంచి తప్పించుకుని ఆర్కే బీచ్ ప్రాంతానికి చేరుకున్నాడు. పోలీసులకు విష యం తెలిసి గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులకు చిక్కడం ఖాయమని భావించిన నిందితుడు శుక్రవారం రాత్రి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అప్రమత్తమై అపస్మారక స్థితిలో ఉన్న నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడికి నేరచరిత్ర నిందితుడు రవీంద్రకు నేరచరిత్ర ఉందని సీఐ అప్పలరాజు తెలిపారు. తన స్వస్థలంలో పలు నేరాలకు పాల్పడి పోలీసు రికార్డులకు ఎక్కాడని పేర్కొన్నారు. 2013లో మధురవాడ ప్రాంతం లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని గాయపరిచాడని తెలిపారు. ఐదేళ్లలో మూడు కళాశాలలు మారాడని, విద్యార్థులకు, కళాశాలల యాజమాన్యాలకు ఇబ్బందికరంగా మారాడని చెప్పారు. వేధింపులు తాళలేకే ఆత్మహత్యాయత్నం పోలీసులు విచారణ పేరుతో తమ కుమారుడ్ని హింసిస్తున్నారని తండ్రి నాగేశ్వరరావు ఆరోపించారు. వారి హింసను భరించలేకే ఆత్మహత్యాయత్నం చేశాడని విలేకరులకు తెలిపాడు. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నాడు. -
భూమి పట్టా చేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం
స్టేషన్‌ఘన్‌పూర్: తన భూమికి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం జరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొండాపూర్‌కు చెందిన రైతు వనమాల రాజు తన తాత వనమాల భద్ర య్య పేరిట (సర్వే నంబర్ 229/ఏ) ఉన్న వ్యవసాయ భూమిని తన పేరిట పట్టా చేయాలని కోరుతూ ఏడాదిగా రెవెన్యూ అధికారుల చుట్టూరా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కొండాపూర్ వీఆర్ఓ రూ.20 వేలు లంచం అడగగా భార్య పుస్తెలతాడు అమ్మి డబ్బులు ఇచ్చాడు. అయినా తిప్పించుకుంటుండంతోతహసీల్దార్ రామ్మూర్తిని సంప్రదించా డు. తహసీల్దార్ సైతం పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రాజు బుధవారం సాయంత్రం తండ్రి సోమయ్యతో కలిసి తహసీల్ కార్యాలయానికి వచ్చాడు. తహసీల్దార్‌ను, వీఆర్ఓను కలిశారు. అక్కడ వీఆర్ఓ రామకృష్ణను కలవగా, రోజూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. అసలు మీ పేరిట పట్టా కాదని మండిపడ్డాడు. దీంతో మనోవేదనకు గురైన రాజు పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు బానోతు సునీల్‌నాయక్‌తోపాటు స్థానికులు అతడి నుంచి మందు డబ్బా లాగి పారేశారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. -
ప్రేమించారు.. వదిలించుకోవాలనుకున్నారు
జిల్లాలో ఇద్దరు యువతుల ఆత్మహత్యాయత్నం తెలకపల్లి : ప్రేమించారు.. పెద్దలను ఎదురించి పెళ్లికూడా చేసుకుంటామని నమ్మబలికారు.. చివరికి నిరాకరించడంతో మోసపోయామని అర్థం చేసుకొని ఆ ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాలిలా.. తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన సముద్ర అనే యువతితో అదే గ్రామానికి చెందిన సలేశ్వరంతో నాలుగు నెలలకిందట పరిచయం ఏర్పడింది. చివరికి అది ప్రేమకు దారితీయగా సలేశ్వరం యువతిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇటీవల యువతి వివాహం చేసుకోవాలని కోరగా యువకుడు నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదిలావుండగా ఈ సంఘటనను కారణంగా చూపుతూ సముద్ర తండ్రి అశ్వయ్య తన బంధువులతో కలిసి సలేశ్వరాన్ని చితకబాది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ షేక్షఫి తెలిపారు. కోస్గి : మండల పరిధిలోని హన్మాన్పల్లికి చెందిన చంద్రయ్య, బుజ్జమ్మల కూతురు మౌనిక,ఆర్మీలో పని చేసే దౌల్తాబాద్ మండలం చెల్లాపూర్‌కు చెందిన సాయి అనే యువకులిద్దరు కొన్నేళ్లు గా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తున్న సాయి జిల్లాకేంద్రంలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోవడానికి ఈనెల 7న ఆదివారం సెలవుపై వచ్చాడు. అంతా సిద్ధమైన తర్వాత పెళ్లి కూతురు జిల్లా కేంద్రానికి వెళ్లి ఫోన్ చేయగా ఇంట్లో వారు వద్దంటున్నారని, నేను చేసుకోనని నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన మౌనిక సోమవారం ఉద యం స్వగ్రామానికి తిరిగి వచ్చి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. -
లెక్చరర్ వేధింపులు తాళలేక..
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం సమితిసింగారం (మణుగూరు రూరల్): లెక్చరర్ వేధింపులు తట్టుకోలేని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఆ విద్యార్థిని తండ్రి తెలిపిన ప్రకారం... మణుగూరు మండలం సమితిసింగారం పంచాయతీలోని గుట్టమల్లారంలోగల గ్రేస్ మిషన్ జూనియర్ కాలేజీలో అశ్వాపురం మండలం మల్లెమడుగు గ్రామానికి చెందిన విద్యార్థిని చదువుతోంది. ఆమె రోజూ కాలేజి బస్సులో వెళ్లి వస్తోంది. అదే కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా అశ్వాపురం గ్రామానికి చెందిన రాజారావు పనిచేస్తున్నాడు. అతడు కూడా అదే బస్సులో ప్రయూణిస్తూ, ఆ విద్యార్థినిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఆమె మంగళవారం కాలేజీ నుంచి ఇంటికి వచ్చి, తనను లెక్చరర్ రాజారావు వేధిస్తున్నాడని, ఇకపై ఆ కాలేజీకి వెళ్లనని తండ్రితో చెప్పింది. ఆ తరువాత, సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కఠినంగా శిక్షించాలని ఆందోళన తన కుమార్తెను వేధించి, ఆమె ఆత్మహత్య యత్నానికి కారకుడైన లెక్చరర్‌ను కఠినంగా శిక్షించాలన్న డిమాండుతో విద్యార్థిని కుటుంబీకులు, బంధువులు కలిసి బుధవారం ఉదయం మణుగూరులోని కాలేజి వద్ద ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా యువజన, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు వచ్చారు. ప్రిన్సిపాల్‌ను ఆందోళనకారులు, విద్యార్థి సంఘాల నాయకులు నిలదీశారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మణుగూరు ఎస్సై ఎం.అరుణ్ కుమార్ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. నిందితుడైన లెక్చరర్ రాజారావు మంగళవారం రాత్రి పరారైనట్టు స్థానికులు చెప్పారు. అశ్వాపురం సీఐ వేణుచందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
విద్యార్థినిని వేధించిన ప్రైవేట్ లెక్చరర్
తాళలేక ఆత్మహత్యాయత్నం మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో లెక్చరర్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి కథనం ప్రకారం... అశ్వాపు రం మండలం మల్లెమడుగు గ్రామానికి చెందిన విద్యార్థిని రోజూ కాలేజీ బస్సులో వస్తుంది. కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అశ్వాపు రానికి చెందిన రాజారావు కూడా అదే బస్సులో వస్తూ విద్యార్థినిని మానసికంగా వేధిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక.. తనను లెక్చరర్ వేధిస్తున్నాడని, తాను ఆ కాలేజీకి వెళ్లనని సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. లెక్చరర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి బంధువులు బుధవారం కళాశాల వద్ద ఆందోళన చేశారు. లెక్చరర్ పరారీలో ఉన్నాడు. -
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
అనారోగ్యంతో ఇంటికెళ్లొచ్చిన పదో తరగతి విద్యార్థి విషయంలో ఓ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం నిరంకుశంగా ప్రయత్నించింది. గాయపరిచేలా ప్రవర్తించడంతో ఆ పసి హృదయం తట్టుకోలేకపోయింది. చివరకు పురుగుల మందు తాగి ఈ లోకం నుంచే నిష్ర్కమించాలనుకుంది. ఈ సంఘటన కలకలం సృష్టించగా..విద్యార్థి సంఘాల రంగంలోకి దిగాయి. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ⇒ అనారోగ్యంతో ఇంటికెళ్లి తిరిగొచ్చిన ఫలితం ⇒ ఇంటికెళ్లినందుకు రోజుకు రూ.200 ఫైన్ కట్టాలన్న పాఠశాల యాజమన్యం ⇒ అవమానభారంతో పురుగుల మందు తాగిన విద్యార్థి ⇒ రంగంలోకి దిగిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు ⇒ పాఠశాలలోకి జొరబడేందుకు యత్నం, పోలీసుల లాఠీచార్జ్ ⇒ ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు నంద్యాల టౌన్ : నంద్యాల సంజీవనగర్‌లోని సెయింట్ జాన్స్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న నందన్ అనే విద్యార్థి ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహ త్యం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎందుకిలా జరిగిందంటే.. గత నెల 24న నందన్ తను చదువుతున్న పాఠశాలలోనే అస్వస్థతకు గురయ్యాడు. విశ్రాంతి తీసుకోవాలని సిబ్బంది ఇంటికి పంపారు. కోలుకున్న తర్వాత పాఠశాలకు వెళ్లిన నందన్‌ను సెలవు తీసుకున్నందుకు రోజుకు రూ.200 అపరాధ రుసుం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నందన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులకు ఫిర్యాదు పాఠశాలలో జరిగిన సంఘటనపై బాధిత విద్యార్థి నందన్ తల్లిదండ్రులు డిప్యూటీ డీఈఓ తాహేరా సుల్తానా సహా ఎంఈఓ శంకర్‌ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. విద్యార్థి సంఘాల ప్రవేశంతో... విద్యార్థి విషయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించిన పాఠశాల యాజమాన్యం వైఖరిని నిర సిస్తూ ఏపీవీఎఫ్, ఆర్వీఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణమైన పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులను హింసిస్తున్న పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని, యాజమాన్యంపై కేసులు బనాయించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నందన్ అనే విద్యార్థి విషయంలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినదించారు. ఒక దశలో సహనం కోల్పోయిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాఠశాలలకు జొరబడేందుకు యత్నించారు. విద్యార్థులపైకి దూసుకెళ్లిన పోలీసులు పాఠశాల ప్రధాన గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాలు, కార్యకర్తలు, విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. వారిపైకి దూసుకెళ్లి లాఠీ చార్జ్ చేశారు. ఘటనలో ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. చివరకు డిప్యూటీ డీఈఓ తాహేనా సుల్తానా ఇచ్చిన హామీ మేరకు వారు శాంతించారు. ఫీజులు, అపరాధ రుసుం పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్న సెయింట్ జాన్స్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయుడు, ఏపీవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నవీన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఆర్ నాయక్ వేర్వేరు ప్రకటనలో డిమాండ్ చేశారు.