భాగ్యనగరిలో అధునాతన ‘మ్యూజియం’! | New Museum in the city | Sakshi
Sakshi News home page

భాగ్యనగరిలో అధునాతన ‘మ్యూజియం’!

Published Sun, Jun 18 2017 3:09 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

భాగ్యనగరిలో అధునాతన ‘మ్యూజియం’! - Sakshi

భాగ్యనగరిలో అధునాతన ‘మ్యూజియం’!

ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం
- రూ.45 కోట్లతో కుతుబ్‌షాహీ టూంబ్స్‌ ప్రాంగణంలో ఏర్పాటు
- స్వదేశీ దర్శన్‌ పథకం కింద కేంద్ర నిధులతో పనులు
నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతిపెద్దదిగా రికార్డు
 
సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌.. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనశాలలకు ప్రత్యామ్నాయంగా మారిన సరికొత్త ప్రక్రియ. ఓ చారిత్రాత్మక ప్రాంతానికి వెళ్తే.. దాని ప్రత్యే కతలు తెలుసుకునేందుకు సందర్శకులు అక్కడి మ్యూజియం కోసం వెదుకుతారు. మన దేశంలో వీటి జాడ అంతగా లేనప్పటికీ, విదేశాల్లో అన్ని ప్రధాన సందర్శనీయ ప్రాంతాల్లో మ్యూజియంలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా మార్చి ఆధునికంగా ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తు న్నారు. త్రీడీ పరిజ్ఞానంతో సరికొత్తగా విషయా లను మనముందుంచే ఏర్పాట్లు కూడా ఉంటు న్నాయి.

కేవలం  ఆయా ప్రాంతాల ప్రత్యేక తలను వివరించటానికే పరిమితం కాకుండా సదస్సులు, చర్చాగోష్టులు, ఎగ్జిబిషన్లు నిర్వ హించే వెసులుబాట్లు వీటి సొంతం. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ కేంద్రాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తొలిసారిగా ఓ భారీ సెంటర్‌ ఏర్పాటు కాబో తోంది. నిర్మాణం పూర్తయితే ఇది దేశంలోనే పెద్ద ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ కానుంది. దీనికి కుతుబ్‌షాహీ టూంబ్స్‌ ప్రాంగణం వేదిక కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ‘స్వదేశీ దర్శన్‌’ కింద దాదాపు రూ.45 కోట్ల భారీ వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. కుతుబ్‌ షాహీల సమాధులను అంతర్జాతీయ ప్రమాణా లతో అభివృద్ధి చేస్తున్న ఆగాఖాన్‌ ట్రస్ట్‌ పనులకు అదనంగా కేంద్రం దీనిపై భారీగా వ్యయం చేయబోతోంది. ఇటీవల స్వదేశీ దర్శన్‌ పథకం కింద రూ.94 కోట్లు  మంజూరు చేసింది. ఇందులో సింహభాగం కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ అభివృద్ధికే ఖర్చు చేయనున్నారు.
 
టూంబ్స్‌ అభివృద్ధిపై సమీక్ష
కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణ అభివృద్ధిపై పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం సమీక్ష జరిపారు. సమావేశంలో ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ నిర్మాణంపైనా చర్చించారు. పురావస్తు శాఖ అధికారులతో పాటు ఆగాఖాన్‌ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. కుతుబ్‌షాహీ సమాధులను ప్రాధాన్య పర్యాటక కేంద్రంగానే కాకుండా యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆగాఖాన్‌ ట్రస్టు నిర్వహిస్తున్న పనులు వేగంగా సాగాల్సి ఉందని పేర్కొన్న ఆయన, అంతర్జాతీయ స్థాయిలో ‘మ్యూజియం’ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దాన్ని కేంద్రానికి పంపి వీలైనంత త్వరగా నిధులు విడుదల చేసేలా చూడాల్సి ఉందన్నారు. టూంబ్స్‌ అభివృద్ధికి చేపడుతున్న పనుల వివరాలను ఆగాఖాన్‌ ట్రస్టు సీఈవో రితేశ్‌ నందా వివరించారు. స్వదేశీ దర్శన్‌ కింద పనులు చేపట్టే ఇతర ప్రాంతాల ప్రణాళికలను పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రహీం షా అలీ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నారాయణ వివరించారు. 
 
ఆధునిక హంగులతో..
హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీ రాజవంశానికి చెందిన పాలకుల సమాధులు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ప్రపంచంలో మరే రాజవంశానికి ఈ అవకాశం దక్కలేదు. హైదరాబాద్‌ నగర చరిత్ర వీరితోనే మొదలైంది. దీంతో ఆ వంశానికి చెందిన అన్ని వివరాలను ప్రజల ముగింట ఉంచే బృహత్తర ఏర్పాట్లు జరుగుతున్నాయి. టూంబ్స్‌ ప్రాంగణంలోని విశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. భారీ హంగులతో ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ను నిర్మించాలని నిర్ణయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement