
హోంశాఖ వద్దంటున్న చినరాజప్ప?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన శాఖ మార్చాలని సీఎం చంద్రబాబును కోరినట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసు శాఖ వరుస వైఫల్యాలపై శాఖ మార్చుకోవాలని ఆయన నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరగడం, ఓటుకు నోటు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ వైఫల్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
చినరాజప్ప చాలా రోజులుగా తన శాఖలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం మానేశారు. పోలీసు శాఖలో కొత్తగా ఒక్క సంస్కరణ కూడా ఆయన చేపట్టలేకపోయారు. ఆగస్టు 15 తర్వాత కేబినెట్ లో మార్పులు, చేర్పులు ఉంటాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ లో మార్పులు ఉండొచ్చని అధికార వర్గాలు అంటున్నాయి.
చినరాజప్పను మారిస్తే హోంశాఖను ఎవరికి అప్పగిస్తారనే దానిపై టీడీపీలో చర్చలు మొదలైనట్టు సమాచారం. హోంశాఖను బీసీ కోటాలో తనకు కేటాయించాలని అచ్చెన్నాయుడు, తాను కూడా పోటీలో ఉన్నానని నారాయణ అంటున్నట్టు తెలుస్తోంది.