గిన్నిస్ బుక్‌లో లక్ష చదరపు అడుగుల ప్రపంచ పటం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని వైబ్రాంట్స్ ఆఫ్ కలామ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా ప్రపంచ పటం ఆకారం చుట్టూ మానవహారం నిర్వహించారు. శనివారం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 7 వేల మంది విద్యార్థులు హాజరై లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 193 దేశాలతో కూడిన ప్రపంచ చిత్రపటాన్ని వేశారు.
అనంతరం విద్యార్థులు మానవహారంగా నిలబడి ధరిత్రిలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైం ఎస్పీ రాంమోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు ధ్రువ పత్రాన్ని అందజేశారు.