world map
-
‘పిట్ట’ పిచ్చి పరాకాష్ఠకు..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అన్ని హద్దులు దాటుతోంది. భారత ప్రభుత్వంతో గత కొన్ని నెలలుగా తలపడుతున్న ట్విట్టర్.. తాజాగా, మరోసారి కట్టుదాటి ప్రవర్తించింది. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను ప్రత్యేక దేశంగా తన వెబ్‌సైట్‌లోని ప్రపంచ చిత్రపటంలో చూపింది. ట్విట్టర్ వెబ్‌సైట్‌లోని ‘కెరియర్ సెక్షన్’లో పోస్ట్ చేసిన ప్రపంచ పటంలో ట్విట్టర్ ఈ దుందుడుకుతనం చూపింది. ట్విట్టర్ తీరుపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తక్షణమే ట్విట్టర్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చివరకు ఆ మ్యాప్‌ను ట్విట్టర్ తొలగించింది. భారత చిత్రపటంలో మార్పులు చేయడం ట్విట్టర్‌కు ఇది తొలిసారి కాదు. గతంలో లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతాన్ని చైనా దేశంలో అంతర్భాగంగా చూపింది. భారత్ తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన ఐటీ నిబంధనల అమలు విషయంలో ట్విట్టర్ కొన్నాళ్లుగా ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. కావాల్సినంత సమయం ఇచ్చినప్పటికీ భారత ఐటీ చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ట్విట్టర్‌కు భారత్‌లో చట్టబద్ధ రక్షణ కల్పించే ‘ఇంటర్మీడియరీ హోదా’ను సైతం మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తొలగించడం తెల్సిందే. దీంతో, ట్విట్టర్లో పోస్ట్ అయ్యే సంఘవ్యతిరేక అంశాలకు సంబంధించి ఆ సంస్థే నేరుగా చట్టబద్ధ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అక్టోబర్ నెలలో లేహ్‌లో జరిగిన ఒక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఆ ప్రాంతాన్ని చైనాలో భాగంగా ట్విట్టర్ తన జియోట్యాగింగ్‌లో చూపింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం కూడా ట్విట్టర్‌కు గట్టిగా హెచ్చరించింది. భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడాన్ని సహించబోమని స్పష్టం చేసింది. గత నవంబర్లోనూ లేహ్‌ను లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా కాకుండా, జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రాంతంగా ట్విట్టర్ చూపింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసు పంపించింది. మ్యాప్‌ల్లో తప్పులు లేకుండా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. మే 26 నుంచి నూతన ఐటీ నిబంధనల మేరకు ప్రత్యేకంగా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న, భారత్‌లోనే నివసించే గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్లను నియమించాలన్న ఆదేశాలను సైతం ట్విట్టర్ బేఖాతరు చేసింది. తాజాగా, శుక్రవారం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతాను గంటపాటు స్తంభింపజేసింది. ట్విట్టర్ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్తున్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమం సమయం నుంచి ట్విట్టర్, కేంద్రం మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. -
గిన్నిస్ బుక్‌లో లక్ష చదరపు అడుగుల ప్రపంచ పటం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని వైబ్రాంట్స్ ఆఫ్ కలామ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా ప్రపంచ పటం ఆకారం చుట్టూ మానవహారం నిర్వహించారు. శనివారం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 7 వేల మంది విద్యార్థులు హాజరై లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 193 దేశాలతో కూడిన ప్రపంచ చిత్రపటాన్ని వేశారు. అనంతరం విద్యార్థులు మానవహారంగా నిలబడి ధరిత్రిలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైం ఎస్పీ రాంమోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు ధ్రువ పత్రాన్ని అందజేశారు. -
లేపాక్షి ఆలయానికి మహర్దశ
లేపాక్షి : అనంతపురం జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో ఒకటైన లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని అఖిల భారత పంచాయతీ పరషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజినేయులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అతి త్వరలో లేపాక్షికి మహర్దశ రానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి శాస్త్ర, సాంకేతిక, విద్య, సాంస్కృతిక సంస్థ (యునెస్కో, ఫారిస్) తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు దక్కనున్నట్టు కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ), ప్రపంచ హెరిటేజ్ డైరెక్టర్ లూర్దుసామి హైదరాబాద్, పురావస్తు శాఖ సూపరింటెండెంట్ లూహీర్కు ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు. లేపాక్షికి సంబంధించిన గొప్ప ఫొటోలు, యూనివర్సల్ వాల్యూస్, స్థలం, డ్రాయింగ్స్‌ను యునెస్కో ఫార్మాట్లో పంపాలని ఆదేశించిందని తెలిపారు. అవి పంపిన వెంటనే తుది జాబితాలో లేపాక్షి చేరుతుందని పేర్కొన్నారు. అయితే ఈనెల 3న ఢిల్లీలోని ప్రధాని కార్యాలయ కార్యదర్శి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ రాకేష్తివారీకి వినతిపత్రాలు సమర్పించినట్టు ఆయన వివరించారు. -
'ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉండదు'
జమ్మూ: కశ్మీర్లో అశాంతికి కారణమవుతున్న పాకిస్తాన్.. ఇదే ధోరణిని కొనసాగిస్తే ప్రపంచపటం నుంచి కనుమరుగయ్యే అవకాశం ఉందని జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ అన్నారు. సాంబా జిల్లాలోని రాజిందర్ పూరా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘సర్జికల్ దాడుల తర్వాత బుద్ధి తెచ్చుకోకుండా భారత ఆర్మీ ఔట్‌పోస్టులపై దాడి చేస్తోంది. మిలిటెంట్ల చొరబాట్లకు సహకరిస్తూ.. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఇలాగే కొనసాగితే పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన నాటి పరిస్థితులు పునరావృతమవుతాయి’ అని విమర్శించారు. పాకిస్తాన్ విఫల దేశమని, జమ్మూకశ్మీర్ ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉడీ సైనిక స్థావరంపై ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా ఏకాకిని చేశారని, దీంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందన్నారు.